Telugu News » Chandrababu : ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ..!

Chandrababu : ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ..!

తుపాను తీవ్రత, నష్టం దృష్ట్యా దీన్ని 'జాతీయ విపత్తు'గా ప్రకటించాలని కోరారు చంద్రబాబు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక బృందాన్ని పంపాలన్నారు.

by admin

ఈమధ్య మిచాంగ్ తుపాను దెబ్బతో తమిళనాడు (Tamilanadu), ఆంధ్రా (Andhra Pradesh) రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. పలు జిల్లాల్లో రైతులు సర్వం కోల్పోయారు. చేతికొచ్చిన పంట నీళ్లపాలు కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అయితే.. జగన్ (Jagan) సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే భారీ స్థాయిలో నష్టం జరిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రెండు రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇదే క్రమంలో తుపాను ప్రభావాన్ని వివరిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) కి లేఖ రాశారు.

Chandrababu Letter To Pm Modi

తుపాను తీవ్రత, నష్టం దృష్ట్యా దీన్ని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని కోరారు చంద్రబాబు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక బృందాన్ని పంపాలన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే తక్షణ, మెరుగైన సహాయం బాధితులకు అందుతుందని… మీ ప్రకటన ద్వారా బాధితులలో విశ్వాసాన్ని నింపే అవకాశం ఏర్పడుతుందంటూ లేఖలో పేర్కొన్నారు. నష్ట పోయిన ఏపీ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని కోరారు. 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని వివరించారు.

రాష్ట్రంలోని 15 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు చంద్రబాబు. 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రజల జీవనాన్ని దెబ్బతీశాయని తెలిపారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని.. ప్రాథమిక అంచనాల ప్రకారం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. తద్వారా రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని వివరించారు. పంటలు దెబ్బతినడంతో పాటు పలు చోట్ల పశువులు చనిపోయాయి.. చెట్లు విరిగిపడ్డాయి.. దాదాపు 770 కి.మీ. మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు.

తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగిందన్న చంద్రబాబు.. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయిందన్నారు. తుపాను వల్ల పంట నష్టపోయి ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మత్స్యకార పడవలు, వలలకు కూడా నష్టం జరిగిందని.. వారు జీవనోపాధి కోల్పోయారని వివరించారు. తుపాను ప్రభావం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ కే పరిమితం కాలేదని… పొరుగున ఉన్న తమిళనాడులో జనం నష్టపోయారని మోడీకి లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు.

You may also like

Leave a Comment