ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) మృతి తర్వాత 1997 కాల్పుల అంశం మరోసారి హైలైట్ అయింది. ఆనాడు ఏం జరిగిందో తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే గతంలో గద్దర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఆనాటి ఘటనపై చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఈ అంశంపై చర్చ జరుగుతోంది. దానికి మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలే కారణం.
గద్దర్ పై కాల్పులు జరిగిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు. దీంతో ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించారు చంద్రబాబు. మంగళవారం హైదరాబాద్ (Hyderabad) అల్వాల్ లోని గద్దర్ నివాసానికి వెళ్లారు ఆయన. గద్దర్ చిత్ర పటానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిదని అన్నారు. గద్దర్ ను భయం అంటే ఏంటో తెలియని వ్యక్తిగా అభివర్ణించారు. అలాంటి వ్యక్తి లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని.. ఆయన ఎన్నో ప్రజా పోరాటాలకు నాంది పలికారని అన్నారు. ప్రజాయుద్ధ నౌక పేరు వింటే గద్దర్ గుర్తొస్తారని.. ఆయన జీవితం బావి తరాలకు ఆదర్శమని చెప్పారు.
ఇక 1997 కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత గద్దర్.. తనను అనేకసార్లు కలిశారని గుర్తు చేశారు. గద్దర్ లక్ష్యం.. తన లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. పేదల హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమని తెలిపారు చంద్రబాబు. హైదరాబాద్ అభివృద్ధికి కారణం ఎవరో అందరికీ తెలుసని.. నగర అభివృద్ధి ఫలాలు తెలంగాణ (Telangana) లో ప్రతి ఒక్కరకీ అందుతున్నాయని అన్నారు.