తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(ChandraBabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. మీచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు.
అహంకారంతో విర్రవీగితే ఏమవుతుందో తెలంగాణ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని జగన్‌కూ అదే గతి పడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంత క్షోభ పడ్డానో ప్రజలు ఆలోచించాలని, ప్రజాస్వామ్యంలో తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని చంద్రబాబు తెలిపారు. మూడు నెలల తర్వాత జగన్‌కు తెలుసొస్తుందన్నారు. ‘ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉంది.. అహంకారం ఉంటే ఏమవుతుంది అనేది తెలంగాణలో చూశాం.. మరో మూడు నెలల్లో ఇక్కడా చూస్తామని’ చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తనలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించానన్న భయం జగన్‌ను వెంటాడుతోందని, చేయని తప్పుకు జైళ్లో పెట్టారని చంద్రబాబు అన్నారు. తాను 45ఏళ్లుగా ఏ తప్పూ చేయకున్నా జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారని అన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించకూడదా? ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు.
తపాను రావడంతో రైతులకు భారీ నష్టం వచ్చిందని, పంట చేతికొచ్చే వేళ తీరని నష్టం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని, అందుకే నష్టతీవ్రత పెరిగిందని చంద్రబాబు ఆరోపించారు. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడం వల్ల పొలాల్లోకి మురికి నీరు వెళ్తోందని, రైతులు ఇబ్బంది పడుతున్నా అధికారులెవరూ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తుపాను అసాధారణమైనదని, తుపాను వల్ల ఎకరాకు రైతులు రూ.50వేలు నష్టపోయారని చంద్రబాబు తెలిపారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా కడితే రైతులకు నష్ట పరిహారం వచ్చేదని.. రైతులకు న్యాయం జరగాలి అని చంద్రబాబు తెలిపారు. జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రైతులకు పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే.. 3 నెలల తర్వాత నేనే ఇస్తాను. కౌలు రైతులకు సైతం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం” అని చంద్రబాబు చెప్పారు. దేశంలో అప్పుల పాలైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు ఆరోపించారు.