రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) హామీ ఇచ్చారు. ప్రజాగళం(Prajagalam) పేరిట రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఆయన శనివారం కడప జిల్లా(Kadapa District)లో పర్యటించారు. జిల్లాలోని పొద్దుటూరు లో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా ఎవరి ఇలాకా కాదని చంద్రబాబు అన్నారు. ఐదేళ్లు పదవిలో ఉన్న జగన్ కడపకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. సీమలో ట్రెండ్ మారిపోయిందని.. ప్రజలు వైసీపీ బెండు తీయడం ఖాయమని చంద్రబాబు అన్నారు. వైఎస్ జగన్ మీటింగ్ లో బిర్యానీ, క్వాటర్ బాటిల్స్ ఇచ్చారని, వారిని వెన్నోల్లో మీటింగ్ అయితే తమది ఎండల్లో మీటింగ్ అని ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరు, పులివెందులకు చేసింది జగన్ చేసిందేమీలేదని విమర్శించారు.
రెండుసార్లు స్టీల్ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేశారని తాను సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికి ఎప్పుడో పూర్తి చేసే వాడినని అన్నారు. తాను సీఎం అయ్యాక స్టీల్ ప్లాంట్‌ను పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం తన కల అని, అదనపు జలాలను రాయలసీమకు మళ్లించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాయలసీమలో సాగునీరు అందిస్తే ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని, సొంత జిల్లాలో ఏం చేశారో చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు.
జగన్‌కు తెలిసిందల్లా హత్యారాజకీయాలు మాత్రమేనని విమర్శించారు. నందం సుబ్బయ్యను చంపినా భయపడకుండా టీడీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని చంద్రబాబు అభినందించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని టీడీపీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక పొత్తు విషయమై మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గెలవకుండా ఉండడానికి, వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికే పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నమని చంద్రబాబు స్పష్టం చేశారు.
కులం, మనవాడు అని చూడకుండా ఓట్లు వేయాలని చంద్రబాబు కడప ప్రజలను కోరారు. తాను ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లోనే మాదకద్రవ్యాలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాలను అమ్మేవారిని భూమిపైనే లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. విశాఖలో పట్టుబడిన 25వేల కిలోల మత్తు పదార్థాలను దిగుమతి చేసిన వారిని పట్టుకుని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.