– చర్చనీయాంశంగా చంద్రశేఖర్ తీరు
– బీజేపీని వీడేందుకు ప్లాన్స్!
– రాష్ట్ర ఎక్స్ క్లూజివ్
– సైలెంట్ గా డీకే శివకుమార్ తో భేటీ
– ఇంకో 12 మంది కాంగ్రెస్ లోకి వస్తారని హామీ
– చంద్రశేఖర్ బాటలో ఉన్న నేతలెవరు?
– బీజేపీ దౌత్యం ఎందుకు ఫలించలేదు?
ఎన్నికలు దగ్గర పడుతుంటే.. జంపింగ్ జపాంగ్ కామన్. ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు నేతలు జంప్(Jump) అవుతుంటారు. పార్టీలు కూడా ఎవరొచ్చినా ఫర్లేదు అని తలుపులు తెరుచుకుని ఉంటాయి. గెలుపే లక్ష్యంగా ప్రతీ నాయకుడికి ఆహ్వానం పలుకుతాయి. తెలంగాణ(Telangana)లో ఇప్పటికే చేరికల సందడి నెలకొంది. ఇంకో నెల పోతే చేరికల్లో మరింత ఊపు కనిపిస్తుంది. దీనికోసం పార్టీలు సైలెంట్ గా పావులు కదుపుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్(Chandrashekar) కాంగ్రెస్ దారిలో నడుస్తున్నారని తెలిసింది.
ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఈయన.. పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారని ప్రచారం ఉంది. ఆ మధ్య బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేయగా.. పార్టీ అగ్ర నేతలు సంప్రదింపులు జరిపారు. అంతా సెట్ రైట్ అయిందని అనుకుంటుండగా.. చంద్రశేఖర్ సైలెంట్ గా కాంగ్రెస్ లో చేరే అంశంపై చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా విషయం లీక్ అవుతుందని బెంగళూరులో సిట్టింగ్ వేసినట్టుగా తెలుస్తోంది. అక్కడి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ తో చంద్రశేఖర్ భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఇద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. తనతోపాటు 12 మంది సీనియర్ లీడర్లు హస్తం గూటికి చేరతారని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం.
కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఊపు మీదుంది. రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణలోనూ పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో ప్రక్షాళన దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యే కొన్ని కమిటీలను నియమించింది అధిష్టానం. ఇంకా మరిన్ని కమిటీలను ఏర్పాటు చేసి.. క్షేత్రస్థాయిలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే వ్యూహాలు పన్నుతున్నారు హస్తం నేతలు. బెంగళూరు ఫార్ములాను అమలు చేయాలని అనుకుంటున్నారు. దీనికోసం కర్ణాటక నుంచే ఆపరేషన్ తెలంగాణ జరుగుతున్నట్టు సమాచారం. అందుకే డీకేతో చంద్రశేఖర్ భేటీ జరిగిందనే చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టి సౌత్ లో రికార్డ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు కేసీఆర్. కానీ, కాంగ్రెస్ పార్టీ అది జరగనీయమని శపథం చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా జనంలోకి వెళ్తోంది. అయితే.. చంద్రశేఖర్ వెంట వెళ్తున్న ఆ 12 మంది బడా లీడర్లు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీళ్లే కాకుండా ఇంకా ఎంతమంది ఈ బాటలో పయనిస్తారో అని అనుకుంటున్నారు. చంద్రశేఖర్ వికారాబాద్ జిల్లాలో పట్టున్న నాయకుడు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్దారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి విజయం సాధించారు. 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో గెలిచి రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో పని చేశారు. 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. ఉప ఎన్నికలో మాత్రం ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2018లో టికెట్ ఆశించినా ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తర్వాత 2021లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. కానీ, కొన్నాళ్లుగా ఆయన అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టుగా సమాచారం.