Chandrayaan-3: చంద్రునికి అతి వేగంగా చేరువవుతోంది చంద్రయాన్-3. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ వ్యోమ నౌక నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ వేరైనట్టు ఇస్రో (Isro ) వర్గాలు ప్రకటించాయి. దీంతో చంద్రయాన్-3 ప్రాజెక్టులో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది,. ఇస్రో శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. వ్యోమనౌక నుంచి విక్రమ్ ల్యాండర్ వేరైనట్టు ఇస్రో తన సోషల్ మీడియా అకౌంట్లో స్పష్టం చేసింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి మరింత చేరువ కానున్నట్టు పేర్కొంది. దీన్ని చంద్రుని చుట్టూ కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.
ప్రగ్యాన్ రోవర్ తో కూడిన ఈ ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వేరు చేయడమన్నది ఈ మిషన్ లో అతి ముఖ్యమైన ఘట్టమని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వ్యోమనౌక చంద్రుని చుట్టూ 153కి.మీ. x 163 కిలోమీటర్ల ఆర్బిట్ లో ఉందని, ఇక తదుపరి చర్య ల్యాండింగ్ సైట్ ను ఎంపిక చేయవలసి ఉందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్రో చంద్రయాన్-2 సందర్భంగా ఎంపిక చేసిన 500 చదరపు మీటర్ల బదులు 4 కి.మీ. x 2.4 కిలోమీటర్లతో కూడిన స్పాట్ ను ఎంపిక చేసిందని తెలుస్తోంది. అంటే ల్యాండింగ్ ఏరియాను విస్తృతం చేస్తున్నట్టు ఈ వర్గాలు వివరించాయి. చంద్రుని దక్షిణ ధృవం పై ఐస్ కారణంగా ఇది అతి దుర్భేద్య మైనప్పటికీ ఈ ధృవం వద్దకు దీన్ని చేర్చడం
శాస్త్రవేత్తలకు పెద్ద సవాలే !
విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ఈ నెల 23 న చంద్రుని ఉపరితలంపై ‘అడుగు పెట్టవచ్చునని’ భావిస్తున్నారు. అయితే రష్యా ప్రయోగించిన లూనా-25 మిషన్ నుంచి వీటికి గట్టి పోటీ ఏర్పడబోతోంది. సమయం దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ రెండు మిషన్లూ వేర్వేరు ల్యాండింగ్ ఏరియాలను ఎంపిక చేసుకున్న దృష్ట్యా ఇవి ఒకదానికొకటి ఢీకొనే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ఇక స్పేస్ క్రాఫ్ట్ ను చంద్రునికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్ ..(చంద్రుని ఉపరితలం నుంచి 30 కి.మీ. దూరం) నుంచి క్రమంగా అపోలూన్ (జాబిల్లి ఉపరితలం నుంచి 100 కి.మీ. దూరం) కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత అడ్డుగా ఉన్న వ్యోమనౌకను నిలువుగా మార్చే ప్రక్రియను చేపడతారు. ఇదంతా దీని వేగాన్ని తగ్గిస్తూ జాగ్రత్తగా చేబట్టవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అనంతరం ఇదే కక్ష్య నుంచి ఈ నెల 23 న సాఫ్ట్ ల్యాండింగ్ చేయవలసి ఉంటుంది.
చంద్రయాన్-3 చివరి ల్యూనార్ కక్ష్య తగ్గింపు సక్సెస్ కావడంపై ఇస్రో మాజీ చైర్మన్ కె. శివన్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో ఇస్రో చైర్మన్ గా ఉన్న ఆయన.. ఆగస్టు 23 న చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలాన్ని తాకే అద్భుతమైన క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. లోగడ ఎదుర్కొన్న వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈ సారి అన్ని జాగ్రత్తలూ తీసుకోవడం హర్షించదగిన విషయమని ఆయన వ్యాఖ్యానించారు.