Chandraayaan3: చంద్రయాన్ -3 మిషన్ ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి మరింత చేరువైంది. ఇందుకు సంబంధించి చివరిదైన రెండో బూస్టింగ్ ఆపరేషన్ విజయవంతయిందని ఇస్రో ప్రకటించింది. దీంతో జాబిల్లి అతి దగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది. ఇక ఈ మాడ్యూల్ అంతర్గత చెక్స్ ని పూర్తి చేసుకుంటుందని, నిర్దేశిత ల్యాండింగ్ సైట్ వద్ద సూర్యోదయం కోసం ఎదురు చూస్తోందని ఇస్రో వెల్లడించింది. జాబిల్లి నుంచి విక్రమ్ ల్యాండర్ అత్యల్పంగా 25 కి.మీ… గరిష్టంగా 134 కి.మీ. దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది.
ఈ నెల 23 న ఇది చంద్రుని ఉపరితలాన్ని తాకడానికి ఆట్టే సమయం లేదని ఈ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చివరి 30 కిలోమీటర్ల మిషన్ చాలా కీలకమైనదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యేస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమన్యన్ అన్నారు. ఈ నెల 23 న సాయంత్రం సుమారు 6 గంటల 4 నిముషాలకు ఈ వ్యోమనౌక చంద్రుని ఉపరితలాన్ని తాకవలసి ఉందన్నారు
. కాగా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ ని లైవ్ టెలికాస్ట్ చేయవలసిందిగా ఇస్రో అన్ని విద్యాసంస్థలను కోరింది. దేశ వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలు అన్నీ లైవ్ స్ట్రీమింగ్ చేయాలని సూచించింది. మన యువజనుల మేధాశక్తిని ఇది ఇనుమడింపజేయగలదని ఆశిస్తున్నట్టు పేర్కొంది.
మన భారతీయ టెక్నాలజీకి గల అపార శక్తిని ఈ ప్రయోగం చూపుతుందని వివరించింది. సెన్సర్ల తో సహా అన్నీ విఫలమైనప్పటికీ విక్రమ్ ల్యాండర్ ఈ వ్యోమనౌకను సురక్షితంగా చంద్రుని ఉపరితలం మీదికి చేర్చగలదని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. అలా దీన్ని డిజైన్ చేసినట్టు చెప్పారు.