ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు (Political Parties) తమ ప్రచార వేగాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఇటీవల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు.
మరోవైపు బీజేపీ కూడా ప్రచార వేగాన్ని పెంచుతోంది. ఇప్పటికే ప్రధాని మోడీ తన పర్యటనతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కూడా తెలంగాణ పర్యటనకు రానున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఈ రోజు తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆయన పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి.
తాజా షెడ్యూల్ ప్రకారం అమిత్ షా రేపు రాష్ట్రానికి వస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన బేగం పేట విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పాయి. అనంతరం ఆయన గద్వాల్ చేరుకుంటారని పేర్కొన్నాయి. గద్వాల్ లో 12.50 కు నిర్వహించే బహిరంగ సభలో షా పాల్గొంటారని వెల్లడించాయి.
సభ అనంతరం ఆయన నల్గొండకు వెళ్తారని బీజేపీ తెలిపింది. ఆ తర్వాత వరంగల్ లో నిర్వహించే సభల్లో షా పాల్గొంటారని పేర్కొంది. అక్కడి నుంచి సాయంత్రం 6.10 గంటలకు హోటల్ క్షత్రియకు వెళ్తారు. అక్కడి నుంచి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేయనున్నారని తెలిపింది. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులతో ఆయన భేటీ అవుతారని, సాయంత్రం 7:55 కి బేగంపేట విమానాశ్రయం నుంచి షా అహ్మదాబాద్ వెళ్తారని వివరించింది.