బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారత్లో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement), సిపాయిల తిరుగుబాటు (sepoy mutiny), సత్యాగ్రహం ఇలా ఎన్నో ఉద్యమాలు చరిత్రలో చోటు సంపాదించుకున్నాయి. కానీ బ్రిటీష్ వారిలో వణుకు పుట్టించిన చపాతీ ఉద్యమం గురించి మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అసలు దీన్ని ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారో తెలియకున్నా ఓ ఉద్యమం లాగా సాగడం గొప్ప విషయం.
1857లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అయింది. దీన్ని మొదటి స్వాతంత్ర్య పోరాటం అని పిలిచారు. అదే సమయంలో భారత్లో చపాతీల ఉద్యమం ప్రారంభం అయింది. యూపీలోని ఆగ్రాకు సమీపంలో మధురాలో ఈ ఉద్యమం మొదలైంది. కొంత మంది నిరసనకారులు చపాతీలను పంచడం ప్రారంభించారు. రాత్రి సమయంలో అటవీ ప్రాంతం నుంచి ఓ వ్యక్తి గ్రామ చౌకీదార్ కు చపాతీలు ఇచ్చేవారు.
ఆ చపాతీలను తీసుకుని వాటితో పాటు మరి కొన్ని చపాతీలు చేసి గ్రామాల్లో పంపిణీ చేయాలని చెప్పేవారు. ఆ కాపలాదారు ఆ గ్రామస్తులకు అదే విషయాన్ని చెప్పే వారు. దీంతో ఆ గ్రామస్తులు మరికొన్ని చపాతీలు చేసి వాటిని పక్క గ్రామానికి పంపేవారు. ఆ పక్క గ్రామస్తులు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. ఇలా చపాతీల పంపిణీ ఓ ఉద్యమంలా సాగింది.
అలా మొదలైన ఉద్యమం క్రమంగా దేశం మొత్తం వ్యాపించింది. ఈ క్రమంలో కొన్ని సార్లు బ్రిటీష్ వాళ్ల పోలీసు స్టేషన్ లకు కూడా చపాతీలు వెళ్లేవి. విషయం తెలుసుకున్న బ్రిటీష్ అధికారి థోర్నో హిల్ విచారణ చేపట్టారు. కానీ ఈ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారనే విషయాన్ని మాత్రం కనిపెట్ట లేకపోయారు. దీంతో ఈ ఉద్యమాన్ని బ్రిటీష్ పాలకులు కలవరపడ్డారు.
ఈ చపాతీలతో పాటు కొన్ని సార్లు మేక మాంసం, ఎర్ర తామర పువ్వులు పంపేవారని, ఈ చపాతీల ద్వారా రహస్య సమాచారాన్ని పంపే వారని కొంత మంది చరిత్రకారులు చెబుతున్నారు. మరి కొంత మంది ప్రజల్లో ఒక చైన్ సిస్టమ్ తీసుకు వచ్చి ఉద్యమానికి సంసిద్ధత చేసేందుకు ఇలా చేశారని ఇంకొందరు అంటున్నారు. కారణమేదైనా ఈ ఉద్యమం మాత్రం బ్రిటీష్ వాళ్లలో ఓ తెలియని భయాన్ని కలిగించిందనేది వాస్తవం.