తెలంగాణ (Telangana) లో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay). రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) లో బీజేపీ (BJP) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ మేళ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అలాగే, రానున్న ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని.. దీనికోసం పార్టీ శ్రేణులు కష్టపడాలన్నారు సంజయ్. పదేళ్ల పాలనలో ప్రజలకు కేసీఆర్ ఒరగబెట్టిందేమీ లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడిస్తారని అన్నారు. ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలుసని చెప్పారు. కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థులు దండుపాళ్యం ముఠా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు బండి. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి కంటే.. సీఎం కేసీఆర్ వెరీ డేంజర్ అంటూ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రెండు సార్లు అధికారంలో ఉండి నట్టేట ముంచిన బీఆర్ఎస్ కు ఓటు వేస్తారా? మీ కోసం ఉద్యమాలు చేసి జైళ్లకు పోతున్న బీజేపీకి ఓటేస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు.
చేవెళ్ల పర్యటనలో భాగంగా.. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ పాపన్న విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు బండి సంజయ్. బూత్ మేళలో భాగంగా చేవెళ్ల కూడలి నుంచి సీహెచ్ఆర్ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ లీడర్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.