ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో తరచుగా గజరాజులు దాడిచేస్తున్న ఘటనలు ఇక్కడి ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా బలరాంపూర్ (Balrampur)జిల్లా, వాద్రాఫ్‌నగర్‌లో అడవి ఏనుగులు భీభత్సం (Elephants Attack) సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు గజరాజుల ఘనకార్యం కారణంగా ఐదు పాఠశాలలు మూతపడిన పరిస్థితి నెలకొంది.
రోజు సూరీడు అస్తమించగానే అడవి ఏనుగులు గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోకి వచ్చిన ఏనుగులు ఇళ్లపై దాడిచేసి.. ధ్వంసం చేయడం ప్రారంభిస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది రైతుల పంటలు సైతం నాశనం చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇంత నష్టం జరుగుతున్న ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు..
మరోవైపు గత పది రోజులుగా వాద్రాఫ్‌నగర్ (Wadrafnagar) కాకనేసలో మూడు ఏనుగుల గుంపు భీభత్సం సృష్టిస్తున్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అడవికి కూతవేటు దూరంలో ఉన్నఈ గ్రామంలోకి తరచుగా వస్తున్న గజరాజులు ఇంట్లో ఉంచిన ధాన్యం బస్తాలను తింటున్నాయని ఆవేదన చెందుతున్నారు.. అదీగాక నిన్నరాత్రి పాఠశాలకు చాలా దగ్గరగా ఉన్న ఇంటిని కూడా కూల్చివేశాయన్నారు. ఏనుగుల బెడద వల్ల.. సమీపంలోని ఐదు పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు సైతం ప్రకటించినట్లు తెలిపారు.
ఇప్పటికే పెద్ద మొత్తంలో గోధుమలు, కూరగాయల పంటలను ధ్వంసం చేయగా.. గ్రామంలోని మూడు ఇళ్లను కూడా ఏనుగులు ధ్వంసం చేసినట్లు తెలిపారు. అలాగే రాత్రిపూట మెలకువగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు స్థానికులు వివరించారు. ఇదిలా ఉండగా.. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అడవుల్లోకి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ తరపున అధికారులు ప్రజలకు సూచించారు.