ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Election) వేళ దారుణం జరిగింది. నారాయన్ పూర్ (Narayanpur) జిల్లా బీజేపీ ఉపాధ్యాక్షుడు (BJP Vice President) రతన్ దూబే (Ratan Dubey).. కోసల్నర్ (Kosalner) గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పై దాడికి దిగారు. పదునైన ఆయుధాలతో దూబేపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మరోవైపు ఎన్నికల ముందు హత్య ఘటన స్థానిక బీజేపీ నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది.
కాగా రాజకీయ నేత హత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వారే రతన్ దూబేను హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే గత నెల 20న కూడా బీజేపీ కార్యకర్త బిర్జు తరమ్ ను మావోయిస్టులు హతమార్చారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మొహ్లా మన్పూర్ అంబాగఢ్ చౌకీ పట్టణంలో.. బీజేపీ నేత బిర్జు తారామ్ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు అగంతకులు 3 రౌండ్ల కాల్పులు జరిపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.