బీఆర్ఎస్ (BRS) మరోసారి అధికారం చేపట్టకుండా ప్రధాన పార్టీలు క్షేత్ర స్థాయిలో శ్రమిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే బీజేపీలోని ముఖ్య నేతలందరు కారు టైర్లను పంక్చర్ చేసే పనిలో ఉండగా.. కారు స్టీరింగ్ పడగొట్టాలని కాంగ్రెస్ ఏకంగా అవినీతి అస్త్రాన్ని బీఆర్ఎస్ పై ప్రయోగిస్తుందని జనం భావిస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కొన్ని కార్యరూపం దాలుస్తున్నట్టు కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటిస్తున్న ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అధికార పార్టీ పై విరుచుకుపడ్డారు..
ఆదిలాబాద్ లో పర్యటిస్తున్న ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh) ముఖ్యమంత్రి.. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం హామీలేవీ నెరవేర్చలేదని మండిపడ్డారు. 10 ఏళ్ళ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని పేర్కొన్నారు. నీరు, మద్యం, ఖనిజవనరులన్నీ కేసీఆర్ కుటుంబ దోపిడీకి గురయ్యాయని ఆరోపించారు. అబద్దాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుని, పేదల పొట్టలు కొడుతుందని మండిపడ్డారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ భూపేష్ బఘేల్.. ధరల పెంపుతో కేంద్రం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. నిన్నటి నుంచి నేను తెలంగాణాలో పర్యటిస్తున్నాను.. ఇక్కడ కాంగ్రెస్ (Congress) గెలుపుకు వాతావరణం అనుకూల కనిపిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలు విశ్వసిస్తున్నారన్న భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ళు, రైతుబంధు, యువవికాసం, మహాలక్ష్మీ, పింఛన్ల పథకాలు జనానికి మేలు చేసేవని పేర్కొన్నారు.
కాంగ్రెస్ తో కేసీఆర్ కు భయం పట్టుకుందని ఆరోపించిన భూపేష్ బఘేల్.. ఎమ్మెల్సీ కవిత విషయంలో కేవలం ఈడీ నోటీసులతో సరిపెట్టడం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధానికి నిదర్శనమని విమర్శించారు. ఇక తెలంగాణలో కరెంటు తామే సప్లై చేస్తున్నామని.. దానికి సంబంధించిన డబ్బులు ఇంకా కేసీఆర్ సర్కార్ బకాయిపడి ఉందని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళిత బంధు, విద్య, వైద్యం ఇలా అన్ని హామీలూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు.