ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న అయోధ్యలో ‘రామ్ లల్లా’ (Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రాష్ట్రంలో డ్రై డే (Dry Day) పాటించాలని నిర్ణయించింది. శ్రీ రాముడి అమ్మమ్మ తాతయ్యల జన్మస్థలం చత్తీస్ గఢ్ కావడం తమ రాష్ట్ర అదృష్టమని సీఎం విష్ణు సాయి దేవ్ (Vishnu Deo Sai )తెలిపారు.
జనవరి 22న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరగడం తమ అదృష్టమన్నారు. రాష్ట్రంలో డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు సుపరిపాలన వారోత్సవాలను నిర్వహిస్తున్నామని సీఎం విష్ణు దేవ్ సాయి వెల్లడించారు. సుపరిపాలనలో తమకు రామ రాజ్యమే ఆదర్శమని తెలిపారు. ప్రాణ ప్రతిష్ట రోజు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుందని అన్నారు.
దీపావళి పండుగలాగా ఆ రోజు ఇళ్లలో దీపాలు వెలిగిస్తామని, జనవరి 22ని రాష్ట్రవ్యాప్తంగా డ్రై డేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలను నిలిపి వేస్తున్నామని తెలిపారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ 300 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయోధ్యకు పంపించిందని వివరించారు. రాష్ట్రానికి చెందిన రైతులు కూరగాయలు కూడా పంపిస్తున్నారని చెప్పారు.
శ్రీ రాముడు వనవాస సమయంలో చత్తీస్ గఢ్ లోని పలు ప్రాంతాల్లో సంచరించారని చరిత్ర కారులు చెబుతున్నారు. చరిత్రకారులు, పరిశోధకుల ప్రకారం శ్రీ రాముని తల్లి కౌలస్య జన్మస్థలం చందకూరి గ్రామం. రాజధానికి రాయ్ పూర్ కు 27 కిలో మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ద మాతా కౌసల్య ఆలయం ఉంది. ప్రతి యేటా వేలాది మంది భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.