చిన్న పిల్లల అదృశ్యం.. వైద్యుల నిర్లక్ష్యంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల కొందరు చిన్నారులు ఆ ఆసుపత్రిలో అదృశ్యమయిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది.
తాజాగా మరో చిన్నారి నీలోఫర్ ఆసుపత్రిలో అదృశ్యమయ్యాడు. ఓ మహిళ ఎత్తుకుంటానని తీసుకొని చిన్నారిని తీసుకొని పారిపోయింది. ఆర్నెళ్ల చిన్నారి ఫైజల్ఖాన్కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈక్రమంలో ఫైజల్‌ఖాన్ తల్లి భోజనం చేస్తుండగా.. పక్కనే ఉన్న ఓ మహిళ ఎత్తుకుంటానని చిన్నారిని తీసుకుంది.
ఆ తర్వాత అక్కడి నుంచి చిన్నారిని తీసుకొని పరారయింది. అయితే భోజనం చేసి తిరిగొచ్చాక.. ఫైజల్‌ఖాన్ కనిపించకపోవడంతో.. తల్లి ఆసుపత్రి అంతా వెతికింది. అక్కడున్న వారిని అడిగింది. ఎక్కడా కూడా చిన్నారి ఆచూకీ లభించలేదు. దీంతో ఖంగారు పడ్డ ఫైజల్‌ఖాన్ తల్లిదండ్రులు నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
వీలైనంత త్వరగా తమ చిన్నారిని గుర్తించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. చిన్నారి ఆచూకీని గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీ ఫుటేజ్‌ను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.