China: భారత, చైనా దేశాల మధ్య సంబంధాలు ఉభయ దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అతి ముఖ్యమని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారు. మన సమస్యలను మనకు మనం సానుకూలంగా పరిష్కరించుకోవలసి ఉందని చెప్పారు. బ్రిక్స్ సదస్సు కోసం ప్రస్తుతం దక్షిణాఫ్రికా ..జొహాన్నెస్ బర్గ్ లో ప్రధాని మోడీ (Modi) తో భేటీ అయిన ఆయన.. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడవలసి ఉందన్నారు. ఉభయ దేశాల నేతలిద్దరూ ఏకాంతంగా కొద్దిసేపు లాన్ లో నడుస్తూ ముచ్చటించుకున్నారు. గురువారం సాయంత్రం వీరి భేటీలో ప్రధానంగా సంబంధాల మెరుగుదల ప్రస్తావన వచ్చింది.
భారత, చైనా దేశాల మధ్య శాంతి , సుస్థిరత ఏర్పడిన పక్షంలో ప్రపంచానికి, ప్రాంతీయ సంబంధాలకు దోహదం కాగలవని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ దేశాధ్యక్షుడు ప్రధానంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారని ఆయన చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుని సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఉత్తమమని ఉభయ దేశాలు గమనించాలని జిన్ పింగ్ అభిలషించారని ఆయన తెలిపారు.
ఉభయ దేశాల సరిహద్దులోని పశ్చిమ సెక్టార్ లో వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితికి సంబంధించి అపరిష్కృత సమస్యలు ఉన్నాయని, వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సి ఉందని మోడీ .. జిన్ పింగ్ కి స్పష్టం చేశారు. ఇండియా దీనిపైనే ఫోకస్ పెట్టిందని మోడీ పేర్కొన్నట్టు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఢిల్లీలో మరో రెండు వారాల్లో జరగనున్న జీ 20 సమ్మిట్ కి ముందు మోడీ, జిన్ పింగ్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పారు.
2020 లో గాల్వన్ లోయలో భారత, చైనా దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన అనంతరం మోడీ, జిన్ పింగ్ ఇద్దరూ లాంఛనంగా భేటీ కావడం ఇది రెండో సారి. గత ఏడాది నవంబరులో బాలి లో జరిగిన జీ 20 సమ్మిట్ సందర్భంగా వీరు సమావేశమయ్యారు.కాగా లడఖ్ లో నియంత్రణ రేఖ వద్ద సైనిక ఉపసంహరణ అత్యంత ప్రధానమని, రెండు దేశాల సైనికులు తిరిగి వారివారి బేస్ ల వద్దకు వెళ్లడం వల్ల సరిహద్దు సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.