ఈ మధ్య అగ్రరాజ్యం అమెరికా(America) గగనతలంలో వింత వస్తువులు కనిపించడం, క్షిపణులతో వాటిని నేలమట్టడం చేయడం సర్వసాధారణమైపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నాలుగు బెలూన్లను అమెరికా యుద్ధ విమానాలను రంగంలోకి దింపి నేలకూల్చింది.
అమెరికా గగనతలంలో కదలాడిన ఆ బెలూన్ అమెరికా ఇంటర్నెట్(Internet) ను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. బెలూన్ నావిగేషన్, లొకేషన్‌కు సంబంధించిన డేటాను చైనాదిగా అధికారులు తేల్చారు. ఈ బెలూన్ వివాదం ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
తమ దేశంపై నిఘా పెట్టేందుకే డ్రాగన్ ఆ బెలూన్ను ప్రయోగించిందని అమెరికా తేల్చి చెప్పింది. బెలూన్‌లో యూఎస్ గేర్‌తో పాటు ప్రత్యేకమైన చైనీస్ సెన్సర్లు ఉన్నట్లు గుర్తించారు. అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానాలో ఈ బెలూన్ కన్పించడం వల్ల అగ్రదేశం దీనిని తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత ఆ బెలూన్ను కూల్చివేసి శకలాలను సేకరించింది.
ఈ సాంకేతికతతో అమెరికాలోని కీలక ప్రదేశాల ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బీజింగ్‌కు బదిలీ చేయాలని చైనా ప్రయత్నించిందని అమెరికా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ కాదని అమెరికాపై నిఘా పెట్టాలనే ఉద్దేశంతోనే దీన్ని పంపించారని దర్యాప్తులో తేలినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు.
అయితే చైనా మాత్రం అది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన ‘ఎయిర్‌షిప్’ అని చైనా మొదటి నుంచి ఒకటే మాట చెప్తోంది. గాలుల కారణంగా లక్షిత ప్రాంతాన్ని దాటి వచ్చిందని తెలిపింది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల గగనతలాల మీదుగా ఎనిమిది రోజుల పాటు బెలూర్ ప్రయాణించింది. ఈ సమయంలో ఎలాంటి డేటాను ఈ బెలూన్ చైనాకు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించలేదని అధికారులు చెప్పారు.