ప్రత్యేక తెలంగాణ(Telangana) రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి(Chinnareddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రణాళిక సంఘం మూడో ఉపాధ్యక్షుడిగా తనను నియమించడం సంతోషంగా ఉందన్నారు.
తమ సమస్యలను ప్రజావాణిలో చెప్పేందుకే సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ప్రజలకు అవకాశం కల్పించారని కోరారు. ప్రజావాణి ఇన్చార్జిగా తనపై సీఎం పెద్ద బాధ్యతనే పెట్టారని అన్నారు. ఇప్పటి వరకు ప్రజావాణిలో 4.90 లక్షల అర్జీలు వచ్చాయని వాటిని పరిష్కరిస్తామన్నారు. 90 రోజులు పూర్తి కాకముందే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. మిగిలిన హామీలనూ లోక్ సభ ఎన్నికలకు ముందే అమలు చేస్తామన్నారు.
రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నిరుద్యోగ యువతను కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. గొర్రెలు, ఆవుల పంపిణీ కార్యక్రమాల్లో సైతం బీఆర్ఎస్ నాయకులు తమ చేతివాటం ప్రదర్శించారన్నారు.
బీఆర్ఎస్ నాయకులు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్నారో తెలియడం లేదన్నారు. రూ.లక్ష బిల్లు చెల్లించాలంటేనే ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి తలెత్తిందన్నారు చిన్నారెడ్డి. ఉద్యోగ నియామకాల విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.