ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఏపీ(AP)లో మళ్లీ పూర్వవైభవం తెచ్చుకునేందుకు తాపత్రయపడుతోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తె షర్మిల(YS Sharmila)కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. ఇక, కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల నేతలపై ఫోకస్ పెట్టారు. ఒప్పుకుంటే తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) పొలిటికల్ రీఎంట్రీ(Political Re Entry)పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్(Ex Minister Chintha Mohan) ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలు కాకుండా చిరంజీవి సీఎం అయి ఉంటే బాగుండేదని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.
అయితే, తాజాగా ఇవాళ(సోమవారం) రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. కాపులందరూ కాంగ్రెస్‌లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు.. చిరంజీవి కూడా కాంగ్రెస్‌లోకి రావాలని, ఆయన్ని అసెంబ్లీలో చూడాలని ఉందన్నారు. చిరంజీవిని తిరుపతి నుంచి పోటీ చేయాలని కోరారు. చిరంజీవి గనక బరిలోకి దిగితే 50వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
నామినేషన్ వేసి వెళ్లిపోతే చాలు.. ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు చిరంజీవికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వెల్లడించారు.