ఉద్యోగుల పాలిట కరోనా (Corona) శాపంగా మారింది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోగా తాజాగా టెక్ రంగం (Tech Sector)లో ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా ఈ ఏడాదిలో పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా గ్లోబల్ నెట్వర్కింగ్ కంపెనీ సిస్కో సిస్టమ్స్ (Cisco Systems) 4,000 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
గతేడాది ప్రారంభంలో మొదలైన మాంద్యం భయాలు ఉద్యోగులపై ఇప్పటికీ ప్రభావం చూపుతుండగా.. ఫలితంగా ఎన్నో ఉద్యోగాలు ఉడిపోతున్నాయి. ప్రస్తుతం నెట్వర్కింగ్ కంపెనీ సిస్కో సైతం ఇదే బాటలో ప్రయాణిస్తోంది. ఇకపోతే ఈ కంపెనీలో 2023 నాటికి మొత్తం 85,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా లేఆఫ్స్ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానం అని అంటున్నారు. అయితే ఈ తొలగింపుల ప్రక్రియ అంతర్జాతీయంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
మరోవైపు కంప్యూటర్ నెట్వర్కింగ్ పరికరాల తయారీలో అతిపెద్ద సంస్థగా సిస్కో పేరుగాంచింది. కానీ ఈ మధ్య కాలంలో ప్రధానంగా కేబుల్ సర్వీసులతో పాటు టెలికాం విభాగాల నుంచి డిమాండ్ మందగించడంతో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకొన్నట్టు వివరించింది. టెలికాం పరిశ్రమలోని క్లయింట్ల ఖర్చును తగ్గించడం, నెట్వర్కింగ్ గేర్ల ఇన్వెంటరీలను క్లియర్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపింది.
అదీగాక సిస్కో ఉత్పత్తులకు గత కొంతకాలంగా డిమాండ్ (Demand) తగ్గిందని పరిశ్రమ వర్గాలు సైతం వెల్లడించాయి. మరోవైపు, పలు కంపెనీలు ఇప్పటికే లేఆఫ్స్ (Layoffs) ప్రకటించాయి.