తెలంగాణలో (Telangana) ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పోలీస్ (Police) అధికారులు అప్రమత్తం అవుతున్నారు. హైదరాబాద్ (Hyaderabad) జిల్లాలో 1587 పోలింగ్ స్టేషన్లను క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 32 కంపెనీల కేంద్ర బలగాల సహాయాన్ని కోరినట్టు నగర పోలీస్ కమిషనర్ (Police Commissioner) సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. నిఘా కోసం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఆరు బృందాలతో 90 ఫ్లయింగ్ స్క్వాడ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పని చేస్తాయని, ప్రతి స్క్వాడ్‌లో ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ఒక సీనియర్ పోలీసు అధికారి, ముగ్గురు సాయుధ పోలీసు అధికారులు, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారన్నారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు, ఎన్నికల ఖర్చులు, బెదిరింపు ఫిర్యాదులు, సంఘ వ్యతిరేకుల తరలింపు, మద్యం, ఆయుధాలు,పెద్ద మొత్తంలో నగదు వంటి అన్ని ఫిర్యాదులను పరిశీలిస్తారని అన్నారు.
ఈ ఎలక్షన్ సమయంలో వాణిజ్య పన్ను, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), రోడ్డు రవాణా అథారిటీ (RTA), ఎక్సైజ్, నార్కోటిక్స్ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, సీపీ చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 3986 పోలింగ్ స్టేషన్లు 1688 భవనాలు ఉండగా, పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు 35 వేల మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని నగర పోలీస్ కమిషనర్ వివరించారు.