బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమంలో ఆ పార్టీ నుంచి ఇప్పటికే బయటకు వెళ్లిన కీలక నేత పేరు మరోసారి చర్చకు దారితీసింది. స్వయంగా కేసీఆర్ ఆయనకు కాల్ చేసి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఒప్పించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
దీంతో స్వయంగా ఆ నేతనే మీడియా ముందుకు వచ్చి ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మరెవరో కాదు బాబు మోహన్(BABU MOHAN). కేఎ పాల్(KA PAUL) స్థాపించిన ప్రజాశాంతి పార్టీ(PRAJASHANTHI PARTY) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా(TELANGANA PRESIDENT) ప్రస్తుతం ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వరంగల్ ఎంపీ సీటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేటాయించగా ఆమె పోటీ చేయనని చెప్పి కేసీఆర్‌కు లేఖ రాశారు. కడియం శ్రీహరి, కావ్య ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. దీంతో వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్ బాబు మోహన్‌ను కోరినట్లు ప్రచారం జరిగింది.
తాజాగా ఆ ప్రచారాన్ని బాబుమోహన్ ఖండించారు. మరోసారి అలాంటి తప్పు చేయదలుచుకోలేదని స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌లో చేరబోను అని తెలిపారు. ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు.‘తాను కేసీఆర్‌తో మాట్లాడి దాదాపు ఆరేళ్లు అవుతుంది’ ఇదంతా ఎవరు క్రియేట్ చేశారో తెలియదని, తాను ఎవరికీ అమ్ముడుపోనని, తనను కొనే వాళ్లు ఇంకా ఈ భూమి పుట్టలేదని’ బాబుమోహన్ క్లారిటీ ఇచ్చారు.