నారాయణపేట (Naryana Pet) జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికల్ మండలం ఎక్లాస్‌పూర్‌లో స్థానికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళన కారులను చెదర గొట్టేందుకు పోలీసులు (Police) లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపైకి గ్రామస్తులు తిరగబడ్డారు. ఈ క్రమంలో అటు పోలీసులకు, ఇటు గ్రామస్తులకు గాయాలయ్యాయి.
మరికల్ మండలం చిత్తనూరులో ఉన్న ఇథనాల్ పరిశ్రమకు చెందిన రసాయన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు ఎక్లాస్ పూర్ స్టేజీ వద్దకు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం వ్యర్థాలు తరలిస్తున్న ఓ లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాజాగా శనివారం రాత్రి కూడా మరో లారీని పట్టుకున్నారు.
ఆ లారీతో మరికల్- ఆత్మకూర్ రోడ్డుపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయడంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయని గ్రామస్తులు అన్నారు. దీంతో పాటు పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ క్రమంలో పరిశ్రమను మూసి వేయాలంటూ డిమాండ్ చేస్తూ మరికల్- ఆత్మకూరు రోడ్డుపై ధర్నాకు దిగారు.
సదరు కంపెనీపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్థానికులు తెగేసి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ధర్నా విరమించాలని స్థానికులను కోరారు. కానీ ఆందోళన విరమించేందుకు స్థానికులు ససేమేరా అన్నారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులు తిరగబడ్డారు. ఈ క్రమంలో అటు పోలీసులకు, ఇటు స్థానికులకు గాయాలయ్యాయి.