– కాంగ్రెస్ లో పెరిగిన వలసలు
– మోత్కుపల్లి, రవీందర్ రెడ్డి..
– ఆకుల లలిత, విద్యాసాగర్ చేరిక
– నియోజకవర్గాల్లో టికెట్ల లొల్లి తప్పదా?
ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ (Congress) పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) తోపాటు పలువురు నేతలు హస్తం కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, ఏనుగు రవీందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వీరందరికీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు. అయితే.. ఈ చేరికలతో కాంగ్రెస్ లో ఎలాంటి లొల్లి జరుగబోతోందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాజగోపాల్ రెడ్డి రిటర్న్ తో మునుగోడు (Munugode) కాంగ్రెస్ లో ముక్కోణపు వార్ తప్పదని అంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికే అక్కడ చల్లమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. అయితే.. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నిక జరగ్గా.. ఆయన బీజేపీ నుంచి బరిలో నిలవగా.. పాల్వాయి స్రవంతి ఢీ కొట్టారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. పాల్వాయి స్రవంతికి 23 వేల వరకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి రావడంతో టికెట్ అంశం చర్చనీయాంశమైంది. చలమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతిలతో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నట్లు సమాచారం.
ఇక, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి హస్తం గూటికి చేరడంతో ఆస్థానం ఎవరికి దక్కుతుందనేది ఇంట్రస్టింగ్ గా మారింది. కొన్ని నెలలుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈయన.. తాజాగా కాంగ్రెస్ లో చేరారు. టికెట్ హామీతోనే ఆయన చేరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతోందనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే, మిగిలిన నేతల రాకతో.. పలు నియోజకవర్గాల్లో టికెట్ల లొల్లి తప్పదని అంతా అనుకుంటున్నారు.
మరోవైపు, మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ లో చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్న ఈయన.. గవర్నర్ పదవి ఆశించి భంగపడ్డారు. చంద్రబాబును తిట్టి.. బీజేపీకి జంప్ అయ్యారు. అక్కడ కూడా ఇముడ లేక కేసీఆర్ చెంతకు చేరారు. చివరకు ఆపార్టీని కూడా వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లికి మంచి పట్టుంది. రాజకీయ పరంగా ఎంతో అనుభవం కలిగిన నాయకుడు. దీంతో కాంగ్రెస్ కు ఆయన ప్లస్ అవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే.. ఆయన ఏ హామీ మేరకు హస్తం గూటికి చేరారనే అంశం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.