ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కొత్త కొత్త మార్పులు తెరపైకి వస్తున్నాయి. పార్టీల మార్పు, కొత్త చేరికలు, పొత్తులు వంటి అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ (Congress)కు వామపక్షాలకు మధ్య ఎన్నికల పొత్తు కుదిరిందన్న వార్త పొలిటికల్ సర్కిల్ లో సెన్సేషనల్ గా మారింది.
ఈ నేపధ్యంలో పొత్తులపై సీఎల్పీ (CLP) నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పందించారు. సీపీఐ (CPI), సీపీఎం (CPM) పార్టీలకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు జరిగిన ప్రచారం నిజం కాదని తెలిపారు. మీడియాలో వచ్చే వార్తలన్నీ ఊహాగానాలేనని, చర్చలు ఇంకా జరుగుతున్నాయని అన్నారు.
అయితే సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌తో కలసి సాగాలని లెఫ్ట్ పార్టీలు ఆశించాయి. కానీ వివిధ రాజకీయ కారణాలతో అది సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలవాలని కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నారు. కాగా మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీకి బ్రేక్ వేసేందుకు నాడు బీఆర్‌ఎస్‌తో చేతులు కలిన వామపక్షాలకు నేడు అధికార పార్టీతో సంధి కుదరలేదు.
ఇప్పటికే ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కీలకంగా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ తో సాగితే కలిసివస్తుందనే ఆశతో కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే కమ్యూనిస్టుల ఓట్లు కూడా కాంగ్రెస్‌కు కలసి వస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.