సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(CM jagan) నేడు నిర్వహించతలపెట్టిన సూళ్లూరుపేట నియోజకవర్గం పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, సూళ్లూరుపేట వేదికగా సీఎం జగన్ ఓఎన్జీసీ(ONGC) పైపులైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు వర్చ్యువల్‌గా పరిహారాన్ని అందజేశారు.
ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల నష్టపోతున్నందున ఉభయ గోదావరి జిల్లాల్లో, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7 వేల 50 మంది, మొత్తంగా 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం కానీ, వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక వాయిదా చేసుకున్నట్లు తెలిపారు. మనంచేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ సాయం చేస్తున్నట్లు జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.
అదేవిధంగా సోమవారం విశాఖలో 40 బోట్లు దగ్ధమైనట్లు తమ దృష్టికి వస్తే ఆదుకోవాలని తపన పడ్డామని సీఎం తెలిపారు. ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే మత్స్యకార కుటుంబాలకు మంచి జరగాలని బోటు విలువ లెక్కగట్టమని చెప్పి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశామని జగన్ తెలిపారు. ఆ చెక్కులు వెంటనే పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
మనకన్నా ముందు చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలన చేసినా కూడా కనీసం ఇది ఇప్పించాలి, మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఆలోచన చేయలేదని జగన్ విమర్శించారు. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుందని వ్యాఖ్యానించారు. మంచి చేయాలనే తపన ఉంటే దేవుడి సహకారం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.