వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ కల్యాణమస్తు ద్వారా మైనార్టీ వర్గాల ఆడ పిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దీనిద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ పిల్లల వివాహాలకు సాయాన్ని అందిస్తున్నది. తాజాగా వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులను ఇవాళ(మంగళవారం) విడుదల చేశారు.
ఐదో విడత నిధులను ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి(AP CM Jaganmohan Reddy) బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు వర్చ్యువల్‌గా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన 10,132 జంటలకు రూ.78.53 కోట్ల సాయం అందిస్తున్నామని చెప్పారు. వధూవరులకు పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేశామన్నారు.
వధువు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లుగా నిర్దేశించామని తెలిపారు. వయసు పరిమితి పెట్టడం వల్లే రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గిపోయాయన్నారు. దీంతో పేద పిల్లల చదువుల్ని ప్రోత్సహించినట్లు అవుతుందని సీఎం జగన్ వెల్లడించారు. ఇక, పేదల కుటుంబాలు అప్పుల పాలయ్యే పరిస్థితి రావొద్దని సీఎం అన్నారు.
టీడీపీ హయాంలో మొక్కుబడిగా సాయమందించిందన్నారు. అప్పుడు అరకొరగా నిధులు అందించే పరిస్థితి ఉండేదని, కానీ తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.427.27 కోట్లు జమ చేసినట్లు వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.