స్వాతంత్ర్య భారతంలో ఇంకా అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR). 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట (Golconda Fort)లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన సీఎం (CM).. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తున్నానని అన్నారు. ఇన్నేళ్లలో దేశం ఆశించిన లక్ష్యాలను, చేరవల్సిన గమ్యాలను చేరుకోలేదని అన్నారు సీఎం.
వనరులు మెండుగా ఉన్నాం… కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత, భావదారిద్ర్యం ఫలితంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అన్నీఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారని.. దళితులు, బలహీనవర్గాలు, ఆదివాసీలు, మైనారిటీల జీవితాల్లో అలుముకొన్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదని వివరించారు. అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా వనరులు ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్ర్యానికి సార్థకత ఉంటుందని చెప్పారు.
స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడించిందన్న కేసీఆర్.. అహింసా మార్గంలోనే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. గత పాలకుల చేతిలో తెలంగాణ చితికి పోయిందని.. గత ప్రభుత్వాల తీరుతో రైతన్నల జీవితాలు బలైపోయాయని విమర్శించారు. కానీ, ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నట్టుగా రాష్ట్రంలో అభివృద్థి జరుగుతోందని చెప్పారు. ప్రజల ఆశయాలకు, అవసరాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన సాగుతోందని తెలిపారు.
ఒకప్పుడు నీటి చుక్క కోసం అలమటించిన తెలంగాణలో ఇప్పుడు జలధారలు పారుతున్నాయన్నారు సీఎం. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని రైతులకు దాదాపు రూ.37 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని చెప్పారు. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని స్పష్టం చేశారు. తమ హయాంలో నిరంతరం విద్యుత్ ప్రసారంతో తెలంగాణ వెలుగిపోతోందన్నారు. తాము అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గుతోందని.. తలసరి ఆదాయం పెరుగుతోందని అన్నారు కేసీఆర్.