– సీఎంపై గుర్రుగా వామపక్షాలు
– సంప్రదింపులు లేకుండానే టికెట్ల ప్రకటన
– మునుగోడులో కలిసి పని చేసిన పార్టీలు
– వచ్చే ఎన్నికలపైనా ఆశలు పెట్టుకున్న లెఫ్ట్ లీడర్లు
– చివరికి ఝలక్ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత
– రేపు సీపీఐ కీలక సమావేశం
అనుకున్నంత పనే అయింది. వామపక్షాలకు చివరి నిమిషంలో ఝలక్ ఇచ్చారు సీఎం కేసీఆర్ (CM KCR). మునుగోడు (Munugode) ఉప ఎన్నికను గట్టెక్కించుకునేందుకు అప్పట్లో లెఫ్ట్ పార్టీల సపోర్ట్ తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత. అయితే.. రానున్న ఎన్నికల్లోనూ ఇలాగే ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వామపక్ష నేతలు. సీట్ల సర్దుబాటుపై కేసీఆర్ ఎప్పుడెప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి సమయంలో వారికి షాకిచ్చేలా 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. దీంతో ఆయన తీరుపై వామపక్ష పార్టీల నేతలు గుర్రుగా ఉన్నారు. మునుగోడు పొత్తు ధర్మం మరిచారంటూ కన్నెర్ర చేస్తున్నారు. పొత్తు ధర్మం పాటించకుండా కేసీఆర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని.. వామపక్షాలు రగిలిపోతున్నాయి. కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
రేపు సీపీఐ (CPI) రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుందని ఆ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Sambasivarao) తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. ముందు నుంచి లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ వచ్చేవి. మునుగోడులో మాత్రం లెక్క తప్పింది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ తో జత కట్టాయి లెఫ్ట్ పార్టీలు. చివరకు యూస్ అండ్ త్రో పద్దతిలో వారిని కేసీఆర్ వదిలించుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.