మనకు స్వతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తోందని, ఇంకా మన దేశంలో రావాల్సినంత పరిణితి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తుంటాయ్.. పోతుంటాయ్ అన్నారు. కానీ ప్రజలు మాత్రం ఆగం కావద్దన్నారు. నిదానంగా మంచీ చెడులు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు ఆయన సూచించారు.
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ఆ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ…. ఎన్నికలు చాలా వస్తుంటాయన్నారు. మీరు చాలానే ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. ఎన్నికలు వస్తే పార్టీకి ఒకరు నిలబడుతారన్నారు. బీఆర్ఎస్ నుంచి నాగేశ్వర్‌రావు నిలబడ్డారని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇతర వ్యక్తులు నిలబడతారని వెల్లడించారు. వ్యక్తుల వెనుక పార్టీలు వున్నాయన్నారు. ఏ పార్టీ చరిత్ర ఏంటో తెలసుకుని ఓటు వేయాలన్నారు. ఆయా పార్టీలకు అధికారం ఇస్తే ఏం ఆలోచిస్తారు.. బీదల గురించి ఆయా పార్టీల దృక్పథం ఎలా వుంది? అనే అంశాలపై గ్రామాల్లో, పట్టణాల్లో చర్చ జరగాలన్నారు.
ఆ చర్చల్లో అన్ని విషయాలను తేల్చినంక మాత్రమే ఓట్లు వేయాలన్నారు. ఎన్నికల్లో నేతలు గెలవడం కాదు… ప్రజలు విజయం సాధించడమనేది ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు గెలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మొదట తెలంగాణ రాష్ట్రం మనకే ఉండేనన్నారు. కానీ దాన్ని బలవంతంగా ఆంధ్రాలో కలిపారన్నారు.
హైదరాబాద్ రాష్ట్రం ఉండి వుంటే ఈ సమయానికి మన ప్రాజెక్టులు పూర్తయి చాలా ధనిక రాష్ట్రంగా ఉండేవాళ్లమన్నారు. అదే జరిగితే మన దరిద్రమంతా తీరిపోయేదన్నారు. సమైక్య రాష్ట్రంలో కలవడంతో వాళ్ల దృక్పథం ఎంత సేపు వాళ్ల వైపే కానీ మన వైపు లేకుండేదని అన్నారు. అందువల్లనే బాధలు అనుభవించామన్నారు.
అందుకే పార్టీల చరిత్ర చూడాలని తాను చెబుతున్నానన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ఎన్నికలు వస్తే మన దేశంలో ఉన్నంత హడావుడి ఉండదు. ఇక్కడ జరిగినట్టు పెద్ద పెద్ద సభలు జరగవన్నారు. టీవీ సందేశాలు, పాలసీ మెసేజ్ ల ద్వారా జరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు.
మన దేశంలో అలాంటి వ్యవస్థ రాలేదన్నారు. మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే చాలు అబద్ధాలు, అబండాలు, నెరవేర్చేందుకు వీలుగానీ వాగ్దానాలు ఉంటాయన్నారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చూస్తున్నామన్నారు. ఇదంతా పోవాలంటే తాను కోరుకున్న ప్రజాస్వామ్య పరిణితి రావాలన్నారు.
తెలంగాణను ఊడగొట్టి.. ఆంధ్రాలో కలిపిన పార్టీ ఏది? అని ప్రశ్నించారు. ఆ పని చేసింది కాంగ్రెస్సే కదా అని మండిపడ్డారు.. ఎన్ని సార్లు ఉద్యమాలు వచ్చినా అణచివేసింది ఎవరు ? అని నిలదీశారు. 1969లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. మనం ఉద్యమం ప్రారంభించిన తర్వాత 2004లో మనతో పొత్తు పెట్టుకున్నారన్నారు.
పొత్తుల ప్రకారం చూస్తే న్యాయబద్ధంగా 2004, 2006లోనే తెలంగాణ ఇవ్వాల్సిందన్నారు. కానీ, మోసం చేసి తెలంగాణ ఎగబెట్టే ప్రయత్నం చేసిందన్నారు. మనం ఉధృతంగా పోరాటాలు చేసి, ఎదురొడ్డి పోరాటం చేసిన తర్వాత 14 ఏండ్ల తర్వాత కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని తాను ఆమరణ దీక్షకు దిగితే అప్పుడు తెలంగాణను ప్రకటించారన్నారు. వెంటనే ఆ ప్రకటన నుంచి వెనక్కి వెళ్లారన్నారు. మళ్లీ ఏడాదిన్న ఉధృతంగా పోరాటాలు చేస్తే అప్పుడు దిగివచ్చి తెలంగాణ ఇచ్చారన్నారు.
ఈ సభలో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ బీఆర్‌ఎస్ విజయానికి కృషి చేస్తానన్నారు.