సీఎం కేసీఆర్‌పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్(Balmuri Venkatesh) హైకోర్టు(High court) లో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్(CM kcr) చేసిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రభాకర్‌రెడ్డిపై దాడిని ఖండించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తనను బాధకు గురిచేసిందని.. ఎన్నికలు ఎదుర్కొనే దమ్ములేని వారే కత్తులతో దాడులకు దిగారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని, దాడులకు దిగేవారు జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆ సభలో హెచ్చరించారు.
దీంతో కేసీఆర్ ప్రసంగంపై పిటిషన్లో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాన్సువాడ సభలో కేసీఆర్ మాట్లాడిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల ప్రసంగం ద్వారా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రసంగం తరువాత కాంగ్రెస్ నేతలపై దాడులు ఎక్కువయ్యాయని బల్మూరి వెంకట్ పిటిషన్లో పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాగా, బల్మూరి వెంకట్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.