కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే ధరణి (Dharani)ని తీసి బంగాళాఖాతంలో వేస్తమని అంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. మళ్లీ దుర్మార్గులు వచ్చి ధరణిని తీసేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ పట్వారీలను పెడతాం, మళ్లీ దళారీలు, దోపిడీలు స్టార్ చేస్తామంటున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ మళ్లీ ఆగం కావద్దన్నదే తన బాధ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. కేసీఆర్ కు ఏం పని లేదని ఈ రోజు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజలు కట్టిన పన్నులన్నీ దుబారా చేస్తున్నారంటూ తనపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
రైతుబంధు వేస్టా? అని ప్రశ్నించారు. రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా.. ఏదో కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
రైతుబంధు ఉండాలంటే ఆదిలాబాద్‌లో జోగు రామన్న గెలవాలన్నారు. ఎకరానికి రూ.10వేలు వచ్చే రైతుబంధు రూ.16వేలు అవుతుందన్నారు. రైతుల భూమలు కింద మీద కావద్దని తాము ధరణిని తీసుకు వచ్చామన్నారు. ధరణితో రైతులకు చాలా అధికారం వచ్చిందన్నారు. గతంలో ప్రజల బతుకులు అధికారుల చేతుల్లో ఉండేదన్నారు. పట్వారీ, గిర్దావర్, తహసీల్దార్ చేతుల్లో అధికారం ఉండేదన్నారు. కానీ తాము వచ్చా అధికారాన్ని ప్రజలకే అందించామన్నారు.
ఇప్పుడు మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి వేరే వాళ్ల పేరుపైకి మారదన్నారు. మీ భూమిని మార్చే శక్తి ఇప్పుడు సీఎంకు కూడా లేదన్నారు. అలాంటి అధికారాన్ని ఉంచుకుంటారా లేదా పోగొట్టుకుంటారా మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ.. ధరణి తీసేస్తా నంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణితో మీ భూములు సేఫ్‌గా ఉంటున్నాయన్నారు.
ఇప్పుడు రిజిస్ట్రేషన్ కేవలం పది నిమిషాల్లో అయిపోతోందన్నారు. గతంలో మ్యుటేషన్ కావాలంటే లంచాలు పెట్టి ఏడాది తిరిగినా పని కాకపోతుండేనన్నారు. కానీ ఇప్పుడు అలాంటి బాధలేదన్నారు. హైదరాబాద్‌లో రైతుబంధు పైసలు వేస్తే మీ ఫోన్లు వెంటనే మోగుతున్నాయన్నారు. వాటిని మీరు పెట్టుబడి కోసం వాడుకుంటున్నారని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ధరణిని తీసివేస్తే రైతుబంధు ఎలా వస్తుంది. ఇది చాలా ప్రమాదమన్నారు.
24గంటల కరెంట్ వేస్ట్ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నాడన్నారు. మూడు గంటలు ఇస్తే సరిపోతుందంటున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరి మూడు గంటల కరెంటు సరిపోతుందా? అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల కరెంటు కావాలంటే జోగురామన్ననే గెలిపించాలన్నారు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తడో హైదరాబాద్‌లో ఆ ప్రభుత్వం వస్తదన్నారు. మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు కాలిపోయిందట అని సామెత ఉందన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే పరిస్థితి అట్లనే ఉంటదన్నారు.