– స్వరాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం
– తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్
– పాలమూరు సస్యశ్యామలం అవుతోంది
– త్వరలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు
– వైద్య సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం
– అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు
– దళిత బంధుతో దళితుల కుటుంబాల్లో వెలుగులు
– రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు
– అద్భుతమైన రోడ్లు.. ఆదివాసీలకు పోడు పట్టాలు
– ఐటీ రంగంలో దూసుకెళ్తున్నామన్న కేసీఆర్
– పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
సెప్టెంబర్ 17 ఎంతో ప్రత్యేకమైన రోజు అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (CM KCR). ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను (National Unity Celebrations) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ (Telangana) లో రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్ వల్లే దేశంలో తెలంగాణ అంతర్భాగమైందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. తెలంగాణ నేలపై పలు సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగాయని.. ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి, గుండెలు ఎదురొడ్డి నిలిచింది తెలంగాణ సమాజమని గుర్తు చేశారు. ఆనాటి ప్రజల పోరాటాలు జాతి గుండెల్లో నిలిచిపోతాయన్నారు. తెలంగాణ సాధనతో తన జన్మ సాకారమైందన్న ఆయన.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రాలో పాలకులు తెలంగాణను పట్టించుకోలేదని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కేసీఆర్. స్వరాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని చెప్పారు. దేశం ఇప్పటికీ ఆర్థికంగా వెనుకబడి ఉందని.. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అని తెలిపారు. పాలమూరు సస్యశ్యామలం అవుతోందన్న సీఎం.. ప్రాజెక్ట్ తో వ్యవసాయానికి ఎంతో లబ్ధి జరుగుతుందన్నారు. పాలమూరు పథకం తెలంగాణలో సువర్ణ అధ్యాయమని.. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ కు కూడా అదనంగా సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు సీఎం. త్వరలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని తెలిపారు. ‘‘ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చాం. ప్రతీ ఏటా 10వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నాం. వైద్య సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంచుతున్నాం. దళిత బంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు. దేశంలో ఎక్కడా దళిత బంధు పథకం లేదు. పెన్షన్లను పెంచాం. రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు. లబ్ధిదారుల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించాం. హైదరాబాద్ లో అల్లర్లు లేవు. అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఆదివాసీలకు పోడు పట్టాలు ఇచ్చాం. ఐటీ రంగంలో దూసుకెళ్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు కేసీఆర్.
ఈ కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి గన్ పార్క్ కు వెళ్లారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ మధుసూదనా చారి, ఎంపీ సంతోశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ ఉన్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం.