కాంగ్రెస్ పార్టీ(Congress party) ఏనాడూ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని సీఎం కేసీఆర్(Cm Kcr) మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖానాపూర్(Khanapur) లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. గిరిజనుల సంక్షేమం కోసం తాము ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, హైదరాబాద్‌లో బంజారాలు, ఆదివాసీల కోసం భవనాలు కట్టించామని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే తండాలను, గోండు గూడేలను పంచాయతీలుగా మార్చుకున్నామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 3,600 పైచిలుకు తండాలను, గోండు గూడేలను పంచాయతీలు చేసినట్లు వివరించారు. తాము ఏ వర్గాన్నీ వదిలిపెట్టకుండా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని వెల్లడించారు. చేనేత, గీత కార్మికులకు, గంగ పుత్రులకు, యాదవ సోదరులకు ఈ విధంగా అన్ని వర్గాలకు సంక్షేమం ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశామని, ఖానాపూర్ నియోజకవర్గంలో సుమారు 7,500 మందికి 22,470 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. అదేవిధంగా రైతుబంధు, రైతు బీమా, బావులు, బోర్లకు త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్ ఉందని.. అయితే అక్కడ బంజారాలు లేరని.. వారిని తరిమేశారని కేసీఆర్ తెలిపారు. అదే బంజారాహిల్స్‌లో తాము కోట్లాది రూపాయలు వెచ్చించి బంజారాభవన్ నిర్మించామన్నారు.
రైతుబంధు దుబారా అంటున్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తరో మీరే ఆలోచించుకోవాలని ఓటర్లను ఉద్దేశించి సీఎం కేసీఆర్ అన్నారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్యాయం జరుగుతదని, పదేళ్లుగా జరిగిన అభివృద్ధి మళ్లీ వెనక్కి పోతదని హెచ్చరించారు. చెప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించవద్దని సూచించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే తెల్లరేషన్ కార్డుదారులకు ఆరు కిలోల బియ్యం అందుతోందన్నారు.
తెలంగాణ ఇప్పుడు పంజాబ్ కంటే ఎక్కువగా మూడు కోట్ల టన్నుల వడ్లను పండిస్తోందని, బీఆర్‌ఎస్ సర్కారు రైతు సంక్షేమానికి ఎంతో చేసిందని కేసీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక నీటి తీరువాను రద్దు చేశామని, పాత బకాయిలు మాఫీ చేశామని తెలిపారు. ‘అదేవిధంగా రైతుల కోసం మేం 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ అని కేసీఆర్ ఉద్ఘాటించారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటలు కరెంటు చాలంటున్నాడని.. ఆయన గురువు కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి మేం ఐదు గంటలు కరెంటు ఇస్తున్నం అంటున్నడని ఎద్దేవా చేశారు. 10 హెచ్‌పీ మీటర్లు పెట్టాలంటున్నారని, వాటికి డబ్బులు ఎవరివ్వాలని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు కావాల్సిందే. మరె 24 గంటల కరెంటు కావాలె అంటే ఇక్కడ జాన్సన్ నాయక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అన్యాయమైపోతారని, తర్వాత నేనేం చేయలేనని కేసీఆర్ అన్నారు.