తెలంగాణ(Telangana) ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్(BRS) ప్రచార రథం సిద్ధమైంది. గులాబీ వర్ణంలో రూపొందిన ఈ బస్సులో అన్ని రకాల ఆధునిక వసతులు కల్పించారు. సీఎం కేసీఆర్(kcr) ఈ వాహనం ద్వారా ప్రసంగిస్తారు. ఈ వాహనంపై తెలంగాణ, భారత దేశ చిత్ర పటంతో పాటు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈరోజు సాయంత్రం హుస్నాబాద్ నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అక్కడి సభలో బీఆర్ఎస్ మెనిఫెస్టో ప్రకటించనున్నారు.
17 రోజుల్లో 42 సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగాలు ఉండనున్నాయి. దీని కోసం ఈ ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. ఈ ప్రచార రథంపై కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారత దేశం పటం, గులాబీ రంగుతో తీర్చిదిద్దారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేతకు ఈ బస్సును ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అశిలేష్ యాదవ్ గిఫ్ట్‌గా ఇచ్చారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొన్ని రోజుల క్రితమే యూపీ నుంచి రాష్ట్రానికి ఈ బస్సు చేరుకుంది. ఈ బస్సు ఈరోజు(ఆదివారం) నుంచి మొదలై కేసీఆర్ ప్రచార సభలకు పరుగులు పెట్టడానికి సిద్ధమైంది.
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వెళ్లి అక్కడ 4గంటలకు బహిరంగ సభలో ఎన్నికల ప్రచారభేరి మోగిస్తారు. సోమవారం నుంచి వరుసగా ఆయన ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈ ప్రచార సభల్లో ప్రచార రథం అన్ని హంగులతో తీర్చిదద్దడం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.