త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ( BRS) హ్యాట్రిక్ సాధించబోతోందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ఎన్నికల్లో 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధి ఆగదని పేర్కొన్నారు. ప్రగతి పథంలో ఇంకా ముందుకు సాగుదామని పేర్కొన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్‌లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ….. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక ప్రతి నెలలో ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గానికి కేటాయిస్తానని తెలిపారు.
గజ్వేల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రజల మధ్యే గడుపుతూ గజ్వేల్ అభివృద్ధి సమీక్షిస్తానన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యుత్, తాగు నీటి సమస్యలు పరిష్కరించుకున్నామని అన్నారు.
సాగు నీటి ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి వారం పది రోజుల్లో తగిన ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం హోదాలో తొలి సమావేశాన్ని ఈ హాలులోనే ఏర్పాటు చేసుకుందామన్నారు.
గజ్వేల్‌లో ఇప్పటి వరకు ఒక విడత అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రెండో విడతలో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారని గజ్వేల్ నేతలు అడిగారని సీఎం అన్నారు. కామారెడ్డిలో పోటీకి కొన్ని కారణాలు ఉన్నాయన్నారు. తాను గజ్వేల్‌ను వదిలి పెట్టి పోయేది లేదన్నారు. తనను ఎంత మెజార్టీతో గెలిపిస్తారనేది ప్రజల దయ అని వ్యాఖ్యలు చేశారు.