మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ (BRS)పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగం మద్దతుదారులు కూడా భారీ సంఖ్యలో కారెక్కారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ హయాంలో ఓబులాపురం మైనింగ్ కుంభకోణంపై పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీలో కొంతకాలం పనిచేశారు. తరువాత ‘తెలంగాణ నగారా’ పార్టీని స్థాపించారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ బీఆర్ఎస్‌లో చేరారు.
అదేవిధంగా నాగంతో పాటు మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కారెక్కారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో విష్ణువర్ధన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్న విష్ణు.. రెండో జాబితాలో తనకు బదులుగా అజారుద్దీన్ పేరు రావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్ తన బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ తనయుడు.. పీజేఆర్ తెలంగాణ గురించి అద్భుతమైన పోరాటం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.
‘హైదరాబాద్ ప్రజలు, సామాన్యుల కోసం రాజీ పడకుండా పోరాడిన పాపులర్ నాయకుడు పీజేఆర్. వారి కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి చాలా ఉత్సాహవంతుడు.. ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. క్రియాశీలకంగా మీతో పాటు పని చేస్తానని చెప్పారు. వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించాను. ఆయన భవిష్యత్ నా బాధ్యత. ఎందుకంటే పీజేఆర్ వ్యక్తిగతంగా నాకు మిత్రుడు, విష్ణు కూడా నా కుటుంబ సభ్యుడే. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నాను’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.