Telugu News » CM KCR: అదే జరిగితే తెలంగాణ పరిస్థితి తలకిందులవుతుంది….!

CM KCR: అదే జరిగితే తెలంగాణ పరిస్థితి తలకిందులవుతుంది….!

రైతు బంధు పథకాన్ని పుట్టించిందే తానని చెప్పారు. రాబోయే రోజుల్లో రైతు బంధును రూ. 16వేలకు తీసుకు వెళ్తామని కేసీఆర్ చెప్పారు.

by Ramu

తెలంగాణ (Telangana) సాధన కోసం తాను పక్షిలాగా తిరిగానని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. దేశంలో రైతు బంధు పథకాన్ని మొదట తీసుకు వచ్చేందే తానని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు పథకాన్ని పుట్టించిందే తానని చెప్పారు. రాబోయే రోజుల్లో రైతు బంధును రూ. 16వేలకు తీసుకు వెళ్తామని కేసీఆర్ చెప్పారు.

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఇవాళ కొన్ని పార్టీల నేతలు సవాళ్లు విసురుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదని, ప్రజలు గెలవాలన్నారు. తెలంగాణ రాక ముందు ఇక్కడి నేతలు ఎవరి బూట్లు తుడిచారో ప్రజలందరికీ తెలుసన్నారు.

నాడు తాను ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే తెలంగాణ ఎక్కడ వస్తుందని అంతా హేళన చేశారని చెప్పారు.`పిడికెడు మందితో మొదలైన పోరాటం ఉప్పెనలాగా మారిందన్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారని వెల్లడించారు. తాను చెబుతున్న విషయాలపై రచ్చ బండ దగ్గర చర్చ పెట్టండని సూచించారు.

నాడు పాలమూరు జిల్లా గంజి కోసం ఏడ్చిందన్నారు. ఇక్కడి ప్రజలు బొంబాయికి వలసలు వెళ్లారని అన్నారు. ఆ రోజు ఈ నేతలంతా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. పదేళ్ల కిందట తెలంగాణ ఎలా ఉండే..? అని అడిగారు. గతంలో రోడ్లు కూడా లేవన్నారు. కరెంట్ కష్టాలు, అన్నదాతల ఆత్మహత్యలు ఉండేవన్నారు. తెలంగాణ చాలా గోస అనుభవించిందన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు.

గతంలో దుందుభి నది దుమ్ముతో నిండి వుండేదన్నారు. కానీ ఇప్పుడు అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు రాగానే ఎంతో మంది నాయకులు మన దగ్గరకు వస్తారన్నారు. కానీ ప్రజలు ఆగం కావొద్దని సూచించారు. అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నం చేశానని, ఇక ప్రజలే నిర్ణయించాలన్నారు.

ప్రతి ఇంటికీ మంచి నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అచ్చంపేటలో ప్రతి పల్లెకు, గూడానికి కూడా నల్లా ద్వారా నీళ్లు అందజేస్తున్నామన్నారు. ప్రధాని రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చడం లేదన్నారు.

కర్ణాటకలోని రైతులు గద్వాల, కొండగల్‌కు వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. కొడంగల్‌కు రా, గాంధీ భవన్‌కు రా అంటూ సవాల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇదా రాజకీయం..? అని నిలదీశారు. ఉద్యమం పుట్టినప్పుడు వీళ్లంతా ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. కేసీఆర్ దమ్ము ఏంటో కొత్తగా చూస్తారా..? అని అడిగారు. నవంబరు 30న దుమ్మ రేగాలన్నారు. అచ్చం పేటలో బాల్ రాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

తెలంగాణలో 3 కోట్ల టన్నుల పంట పడుతోందన్నారు. 24 గంటల కరెంట్ సాధ్యం కాదని గతంలో జానారెడ్డి అన్నారని చెప్పారు. కానీ కరెంట్ ఇచ్చి చూపలేదా మనం..? అన్నారు. మీ కండ్లకు కనిపిస్తున్నదంతా కేసీఆర్ దమ్ము కాదా.. ? అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో దమ్ము కాదు, దుమ్ము రేగాలన్నారు.

పదుల్లో ఉన్న పెన్షన్లను వేలకు తీసుకెళ్లింది తానేనన్నారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. అందుకే పేదలకు చేస్తున్న సాయం పెంచుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో కిందమీద కావొద్దన్నారు. అదే జరిగితే తెలంగాణ పరిస్థితి మళ్లీ తల కిందులవుతుందని హెచ్చరించారు. వ్యక్తిగతంగా తమకు వచ్చే నష్టం లేదన్నారు. మీరే నష్టపోతారన్నారు. అప్పుడు తాను కూడా ఏం చేయలేనన్నారు

పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ అడ్డుపడిందన్నారు. 192 కేసులు వేసి అడ్డుకుందన్నారు. రాబోయే రోజుల్లో దక్షిణ తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి నీళ్లు వస్తాయన్నారు. ధరణిని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్నారు. ధరణి ఉండటంతో అవినీతికి అవకాశం లేకుండా పోయిందన్నారు. రైతులకు అన్ని రకాలుగా లాభం జరుగుతోందన్నారు. అలాంటి ధరణిని తీసివేస్తామని రాహుల్ గాంధీ సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు. దళారుల కోసమే కాంగ్రెస్ ఆరాటమన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్నారు. రైతు బంధును బంద్ చేస్తారన్నారు.

 

You may also like

Leave a Comment