కాంగ్రెస్ (Congress) చరిత్ర గురించి ప్రజలందరికీ తెలిసిందేనని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. అసలు తెలంగాణను ముంచిందే ఆ పార్టీ అని మండిపడ్డారు. 58 ఏండ్ల పాటు తెలంగాణకు కాంగ్రెస్ తీవ్ర నష్టం చేసిందన్నారు. బీఆర్ఎస్ అనేది ప్రజల కళ్లముందే పుట్టిన పార్టీ అని చెప్పారు. తమ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందన్నారు. కేసీఆర్ చచ్చుడో… తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ సాధించానన్నారు.
జనగామ నియోజకవర్గం చేర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ధరణి వల్ల నూటికో కోటికో ఒకరికి సమస్య ఉంటే దాన్ని పరిష్కరిద్దామన్నారు. కానీ ధరణిని తీసేస్తాం.. బంగాళ ఖాతంలో వేస్తామనడం సరికాదన్నారు. మళ్లీ తెలంగాణ కిందకు పోయేటట్టు, మళ్లీ దళారి రాజ్యం తీసుకు వస్తామని కాంగ్రెసోళ్లు బాజాప్తా చేబుతున్నారన్నారు. ధరణి తీసేస్తాం, రైతు బంధు దండగ, మూడు గంటల కరెంట్ చాలని ఖుల్లాఖుల్లాగా కాంగ్రెసోళ్లు అంటున్నారని అన్నారు.
కర్ణాటకలో కరెంట్ ను కాంగ్రెస్ కాట గలిపిందన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదన్నారు. ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో లేదన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్ ఉందన్నారు. కేసీఆర్ జగ మొండి కాబట్టి, ఇక్కడి రైతులను కాపాడుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి 24 గంటల కరెంట్ ఇక్కడ ఉందన్నారు. బోర్ మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ ఆదేశించారని కానీ దానికి తాను ఒప్పుకోలేదన్నారు.
ఈ విషయంపై గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. ఎవరైనా పాలిచ్చే బర్రెను వదిలి పెట్టి దున్న పోతును తెచ్చుకుంటారా అని ప్రశ్నించారు. జిల్లాలో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరైనా ఊహించారా అని ఆయన ప్రశ్నించారు. జనగామలో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరైనా అనుకున్నామా అని అడిగారు. ప్రధాని మోడీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టిండన్నారు. కానీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు.
కేసీఆర్ ను చూస్తే జాతీయ పార్టీలకు భయమైతందన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే నెక్స్ట్ మహారాష్ట్రలో వచ్చి పడతాడని వాళ్లు భయపడుతున్నారన్నారు. మహారాష్ట్రలోని 150 గ్రామాలను తెలంగాణలో కలపాలని అక్కడి గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేశాయన్నారు. తాను అక్కడకు వెళితే తెలంగాణలో వచ్చినట్టే భారీగా జనం వస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే నెల రోజుల్గో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తానన్నారు.