Telugu News » CM KCR : ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టేవారు..!

CM KCR : ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టేవారు..!

పదేండ్ల బీఆర్ఎస్ పాలనను, యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు.

by Ramu

తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్సేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్​ ఎందుకు పార్టీ పెట్టారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనను, యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు.

cm kcr public meeting in warangal and gajwel

వరంగల్, గజ్వేల్ నియోజక వర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కొన్ని రోజుల్లోనే వరంగల్ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీలో లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండేళ్లలో టెక్స్​టైల్​ పార్క్​లో మహిళలకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరం వరంగల్ అని అన్నారు. మూడవ సారి బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 24 అంతస్తుల కొత్త ఎంజీఎం భవనం హైదరాబాద్​లో కూడా లేదన్నారు. ఈ ఎన్నికలో గెలిస్తే ఆటో రిక్షాల కార్మికులకు.. ఫిట్​నెస్​ సర్టిఫికేట్​ పర్మిట్​ ట్యాక్స్​ను రద్దు చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధన కోసమే బీఆర్​ఎస్ పుట్టిందన్నారు. 50 ఏండ్ల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్​ ఏం చేసిందని ప్రశ్నించారు. ఇందిరమ్మ పాలనలో అన్నం కోసం పేద బతుకులు ఎంతో అలమటించాయన్నారు. కానీ ఎన్టీఆర్​ రెండు రూపాయలకే కిలో బియ్యంతో వారి ఆకలి తీర్చారని వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయ్యాక ప్రత్యేక రాష్ట్ర సాధనలో తనకు బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అయితే, ఆ తర్వాత తెలంగాణ వచ్చాక రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు తనను ఎమ్మెల్యేను చేసి, సీఎంగా చేసిన గడ్డ ఈ గజ్వేల్‌ గడ్డ అని చెప్పారు. గజ్వేల్‌ తన గౌరవాన్ని పెంచిందని, తనను ఈ స్థాయికి తెచ్చిందన్నారు.

గతంలో మంచి నీళ్ల కోసం చాలా ఇబ్బందుల పడ్డామన్నారు. కానీ ఇప్పుడు గజ్వేల్‌కు శాశ్వతంగా ఆ బాధ తీరిపోయిందన్నారు. సాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. గజ్వేల్‌కు ప్రాజెక్టులు, కాలువలు రావడంతో ఆ బాధ కూడా తీరిపోయిందన్నారు. గజ్వేల్‌కు రైలు వస్తదని ఎన్నడూ అనుకోలేదన్నారు. కానీ ఇప్పుడు రైలు కూడా వచ్చేసిందన్నారు.

గజ్వేల్‌ మోడల్‌ అభివృద్ధిని చూసేందుకు ఇప్పుడు అంతా ఇక్కడకు వస్తున్నారని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌. అడవుల పునరుద్ధరణ, మన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కావచ్చు.. ఇలా అనేక రకాల పనులను చూసేందుకు గజ్వేల్‌కు వస్తున్నారని అన్నారు . మిషన్‌ భగీరథ పథకాన్ని గురించి తెలుసుకోవడానికి కోమటిబండకు రాని రాష్ట్రమే లేదన్నారు. ఒక రోల్‌ మోడల్‌గా గజ్వేల్‌ ఎదిగిందన్నారు. అయితే ఇప్పటికే అయ్యింది చాలా గొప్ప అని మనం సంతోషపడితే సరిపోదన్నారు. ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉందన్నారు.

You may also like

Leave a Comment