కర్ణుడికి కవచ కుండలాల మాదిరిగా తెలంగాణ (Telangana)కు బీఆర్ఎస్ (BRS) కూడా శ్రీరామ రక్ష అని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసమని చెప్పారు. తెలంగాణ ప్రజలకు కాపాలాగా ఉండి వారి హక్కులను కాపాడేందుకే తమ పార్టీ ఉందని తెలిపారు. కోదాడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గులాబీ జెండా ఎగుర వేసిన అనంతరం నీళ్ల కోసం తండ్లాట జరిగిందన్నారు. ఆ సమయంలో కోదాడ నుంచి హాలియా వరకు తానే పాదయాత్ర చేశానని చెప్పారు. తాను చేసిన రెండో పాదయాత్ర అదేనన్నారు. ఆ నాడు కోదాడ, బాలాజీనగర్ తండాలగుండా వెళ్లినప్పుడు ఎక్కడ చూసినా మొరం కుప్పలే కనిపించాయన్నారు.
ఆ మొరం కుప్పల గురించి తాను రైతులను అడిగితే….. దిక్కులేక బావులు తవ్వుతున్నామని చెప్పారన్నారు. అప్పుడు వాటిని చూసుకుంటూ బాధపడుతూ ముందుకు సాగిపోయామని వెల్లడించారు. ఈ పీడ పోవాలంటే పసలేని.. పిసపిస మాట్లాడే కాంగ్రెస్ నాయకులతో కాదన్నారు. దానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ రావాలన్నారు. అసత్యాలు చెప్పే కాంగ్రెస్ నాయకులు కనీసం సిగ్గుండదా? అని ఫైర్ అయ్యారు.
మొన్న ఇక్కడికో పెద్ద మనిషి భట్టి విక్రమార్క వచ్చాడని ఎద్దేవా చేశారు. ఆయన కూడా ఇక్కడ పాదయాత్ర చేశాడని తెలిపారు. బాధ్యతగల పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎలా మాట్లాడాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడే అబద్ధాలకు కనీసం సిగ్గుండదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదాడలో పాదయాత్రకు వెళ్లినప్పుడు కాళేశ్వరం నీళ్లు కనిపించలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారని చెప్పారు.
మరి ఈ రోజు మునగాల, నడిగూడెం, మోతె మండలాలకు నీరు వచ్చిందా లేదా అని ఇక్కడ ఉన్న ప్రజలే చెప్పాలన్నారు. ఇప్పుడు ఆయా మండలాలకు కాళేశ్వరం నీళ్లు వచ్చి పంటలు పండుతున్నాయన్నారు. ఇప్పుడు మిగిలిన ప్రాంతాలకు కూడా నీరు రావాలన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని అనుసంధానం చేయించే బాధ్యత తనదేనన్నారు. భవిష్యత్‌లో ఖమ్మం, నల్లగొండ జిల్లాలో పంటలు పండాలంటే పాసుపండ్ల కాంగ్రెస్‌తో కాదని ఎద్దేవా చేశారు.
ఈ రోజు కాంగ్రెస్ రాజ్యం ఉంటే.. కాళేశ్వరం నీళ్లు ఇక్కడి వరకు వచ్చేవా అని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు జన్మలో కూడా ఇక్కడికి రాకపోవన్నారు. రేపు నల్లగొండకు శాశ్వత విముక్తి కల్పించే పథకాన్ని బీఆర్ఎస్ సర్కారే తీసుకు వస్తుందన్నారు. మీ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ సర్కార్ వస్తుందన్నారు. ఆ పథకాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు.