పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) దగ్గర పడుతుండడంతో బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు అలర్ట్ అయ్యాయి. హ్యాట్రిక్ విజయం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఈ నేపథ్యంలో అధికార బీజేపీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. భూకుంభకోణం కేసులో బుధవారం ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Jharkhand CM Hemant Soren)ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నదియా జిల్లాలోని సంతిపుర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకే విపక్ష నేతల్ని అందర్నీ బీజేపీ జైలుకు పంపుతోందని విమర్శించారు. బీజేపీ తననూ జైలుకు పంపుతుందేమోనని సందేహాన్ని వ్యక్తం చేశారు.
తాను జైలుకు వెళ్లినా మళ్లీ తిరిగి వస్తానని సీఎం దీదీ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టాలని తమకు ఉందని, కానీ ఆ పార్టీ తమ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీపీఎంతో చేతులు కలిపిందని, ఇది బీజేపీ విజయానికి తోడ్పడుతుందని ఆమె ఆరోపించారు.