సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాగోబా (Nagoba) ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంద్రవెల్లి బహిరంగ సభలో పాల్గొననున్నారు. అంతకు ముందు ఆలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగర్, సీఎస్ శాంతికుమారి, మేస్రం వంశీయులు ఘన స్వాగతం పలికారు.
ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకు స్థాపన చేశారు. తాజాగా కేస్లాపూర్‌లో మహిళా సంఘాల సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సీఎం పదవి చేపట్టాక ఆదిలాబాద్‌లో రేవంత్ రెడ్డి పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అంతకు ముందు పీసీసీ చీఫ్ హోదాలో మొదటి సారి 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, దండోరా సభలో పాల్గొన్నారు. ఇంద్రవెల్లి సభ వేదికగా ఆయన ఈ రోజు మరో రెండు గ్యారెంటీ పథకాల అమలుపై ప్రకటన చేస్తారని సమాచారం. ఎన్నికలకు ముందు ఇచ్చిన రూ. 500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వినియోగం పథకాలపై ఆయన ప్రకటన చేస్తారని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వినియోగం, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలపై అమలుకు సంబంధించి సీఎం ప్రకటన చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ రోజు నుంచే ఇవి అమలవుతాయని రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తొలి సీఎం రేవంత్ రెడ్డి కావడం విశేషం.