ప్రతి నిరుద్యోగి కలను సాకారం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. తెలంగాణ (Telangana) ఉద్యమంలో లక్షలాది మంది నిరుద్యోగుల పాత్ర ఉందని తెలిపారు. నిరుద్యోగుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన వెల్లడించారు. త్వరలో 15వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టిందన్నారు.
స్టాఫ్ నర్సు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….. ఈ రోజు 6956 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగవకాశాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందన్నారు.
గతేడాది డిసెంబర్ 7న ఇక్కడే ఉద్యోగ ప్రమాణాలు చేశామన్నారు. నిరుద్యోగుల కలలు సాకారం చేయడంలో ఇది తొలి అడుగు అన్నారు. తమ ప్రభుత్వంపై హరీశ్ రావు శాపనార్థాలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. టీఎస్సీఎస్సీని ప్రక్షాళన చేసి నూతన చైర్మన్ ను నియమించామని వెల్లడించారు. త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ పునర్ నిర్మాణం కోసం కష్టపడుతామని పేర్కొన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. మాట తప్పబోమని చెప్పారు. ఉద్యోగాలిస్తుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపు మండుతోందన్నారు. అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు.
గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీగా కవిత ఓడిపోగానే ఆమెను కేసీఆర్ ఎమ్మెల్సీ చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలను కల్పించిందని ఆరోపించారు. తమది కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూసే ప్రభుత్వమన్నారు.