సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) కుమ్మక్కై లోక్సభ ఎన్నికలకు రాబోతున్నాయని తెలిపారు. ఆ పార్టీల కుట్రలను తిప్పి కొట్టాలని ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిపోయిందన్నారు. దేశానికి బీజేపీ అత్యంత ప్రమాదకరంగా మారిందని కామెంట్స్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర హక్కులు నెరవేరుతాయని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. . 60 రోజుల్లో లోక్సభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మెజార్టీ స్థానాలను దక్కించుకునేలా కృషి చేయాలన్నారు. ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేసేందుకు ఇప్పటికే తమ ప్రభుత్వం కార్యచరణను రూపొందించిందన్నారు. ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా ఫిబ్రవరి 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని చెప్పారు. మొదట ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయాన్ని హై కమాండ్ చూసుకుంటుందని వివరించరు. దీనికి సంబంధించి హై కమాండ్ ఇప్పటికే రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకులను నియమించిందన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఎప్పుడైనా తనను కలవొచ్చన్నారు.
నియోజకవర్గాల సమస్యలను అందరం కలిసి పరిష్కారం చేసుకుందామని తెలిపారు. కావాలిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కూడా తన అపాయింట్ మెంట్ కోరవచ్చంటూ కీలక కామెంట్స్ చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాట్లాడేదేమిటి..? తాను వినేదేమిటి? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.