– కాంగ్రెస్ సర్కార్ ఉండదంటున్న బీఆర్ఎస్
– తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా
– సర్కారును కూల్చే కుట్ర జరుగుతోందా..?
– హస్తం నేతలు ఏమంటున్నారు..?
– రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్
– కేసీఆర్ కు భారీ షాక్ తప్పదా?
– ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం
తొమ్మిదిన్నరేళ్ల ఎదురుచూపుల తర్వాత తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రంలో ఆపార్టీ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణం చేశారు. కీలక నేతలు మంత్రులుగా ప్రమాణం చేసి శాఖల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ సర్కార్. ఓవైపు పాలనలో తనదైన ముద్ర వేసేందుకు రేవంత్ ప్రయత్నాల్లో ఉంటే.. ఇంకోవైపు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు హస్తం నేతలు. ఓటమి నిరాశలో ఉన్న బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) నేతల మాటలు వింటే ఇది స్పష్టంగా అర్థం అవుతోందని చెబుతున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..?
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కుప్పకూలిపోతుందని బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. దీనికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు గానీ.. వచ్చే ఏడాది తమ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు వారికి వారే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారని వాఖ్యానించారు. ఇక, బీఆర్‌ఎస్ కార్యకర్తలంతా ఏడాది వరకు ఓపిక పట్టాలని.. మన ప్రభుత్వం వస్తుందని కడియం శ్రీహరి అన్నారు. పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరూ భయపడనవసరం లేదని, ఆరు నెలలా, సంవత్సరమా, రెండేళ్లా, మూడేళ్లా.. ‘మళ్లీ ప్రభుత్వం మనదే.. ముఖ్యమంత్రి కేసీఆరేనని’ వ్యాఖ్యానించారు. అలాగే, కాంగ్రెస్ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని బీజేపీ నేత రాజాసింగ్ అన్నారు. ఏడాది తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు.
హస్తం నేతల కౌంటర్ ఎటాక్
బీజేపీ, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు అనుమానాస్పదంగా ఉండడంతో హస్తం నేతలు అలర్ట్ అయ్యారు. తమ ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన పల్లా, కడియం, రాజాసింగ్ లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు. పీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత, కాంగ్రెస్ నాయకులు చారకొండ వెంకటేష్, మధుసూదన్ లు ఈ కంప్లయింట్ చేశారు. అక్రమ పద్దతుల్లో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆపార్టీ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. కొందరు గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కన్నా మించి ఉండదని అంటున్నారని, వీటిని కేసీఆర్ ఖండించాలని డిమాండ్ చేశారు. ‘‘మీరు, మీ పాలన మాత్రమే తెలంగాణ అన్న ధోరణి విడిచి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పదికాలాలు మంచిగా ఉండాలని అభిప్రాయపడే విధానం ఉన్నట్లయితే కేసీఆర్ స్పందించాలి’’ అని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా భారీ స్థాయిలో అయితే సీట్లను రాబట్టలేకపోయింది. మ్యాజిక్ ఫిగర్ 60కి పైన ఇంకో 4 మాత్రమే సాధించింది. సీపీఐ గెలిచిన స్థానం కలిపితే 5 అవుతాయి. అయితే.. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7 సీట్లు సాధించాయి. బీఆర్ఎస్ తో బీజేపీ కలిసే ఛాన్స్ లేదు. మొదట్నుంచి ఎంఐఎం ఫ్రెండ్షిప్ పార్టీగా ఉంది. అవి కలుపుకుంటే 46 స్థానాలు అవుతాయి. అయితే.. కాంగ్రెస్ లో ఉన్న కొందరు నేతలు పక్కచూపులు చూస్తే అధికారం మారుతుంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే ధీమాతో మాట్లాడుతున్నట్టు అర్థం అవుతోంది. కానీ, ఎవరూ ఊహించని విధంగా రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. బొటాబొటీగా ఉన్న బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎంను బీఆర్ఎస్ కు దూరం చేసే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ముందుగా అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను నియమించారు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పై కస్సుబుస్సులాడిన ఎంఐఎం నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నవ్వుతూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. దీంతో పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. వాటికి బలం చేకూర్చుతూ తాజాగా రేవంత్ రెడ్డితో ఎంఐఎం ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పైకి పాతబస్తీ అభివృద్ధిపై మీటింగ్ అని కవర్ చేసినా.. దీని వెనుక పెద్ద ప్లానే ఉందని అనిపిస్తోంది. ఎంఐఎంను మిత్ర పక్షంగా చేసుకునేందుకు రేవంత్ సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీ బలం 72కు చేరుతుంది. అప్పుడు కేసీఆర్ ఏం చేయలేని పరిస్థితి ఉంటుందని రేవంత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎం కలిసే ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ తో దోస్తీ కట్టింది ఎంఐఎం. కాంగ్రెస్ పరిస్థితి రానురాను దిగజారడంతో విమర్శల దాడి కూడా చేసింది. అయితే.. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా హస్తం పుంజుకోవడంతో ఎంఐఎం స్వరం మారినట్టు కనిపిస్తోంది.