పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ (BRS),బీజేపీ (BJP)లు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నాయి. అటు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటకే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలు మార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే ఆయన అధిష్టానం చర్చించినట్టు తెలుస్తోంది.
తాజాగా పీసీసీ అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి 17 పార్లమెంటరీ నియోజకవర్గాల నాయకులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం రెండు రోజుల పాటు కొనసాగనుంది. మొదటి రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో ఎంసీహెచ్ఆర్డీలో రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో రేవంత్ రెడ్డి చర్చించారు. మరోవైపు జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఇంఛార్జ్ లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీలపై బీఆర్ఎస్, బీజేపీ బలబలాలను ఆరా తీసినట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నేపథ్యంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. పదవులు లేకపోయే సరికి బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయడం బీఆర్ఎస్ నేతలకు నచ్చడం లేదన్నారు. ఆటో కార్మికులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
తదుపరి విడతలో మహిళలకు 2500 రూపాయలు, గ్యాస్ సిలిండర్ కోసం రూ. 500, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్ అమలు చేస్తామన్నారు. గత పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్దికి ఆమడదూరంలో ఉందన్నారు. మిగతా ప్రాంతాలకు ధీటుగా ఆదిలాబాద్‌ను అభివృద్ది చేస్తామమని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి సీతక్క వెల్లడించారు.
ఎంసీహెచ్ఆర్డీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు, ఇతర ప్రజా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారని చెప్పారు. జనవరి 26 తర్వాత రాష్ట్రంలో ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి పర్యటన చేస్తారని అన్నారు.