కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో కలిపి 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే.. ఇంకో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 15 మంది దాకా సీనియర్ లీడర్లు పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పార్టీ సీనియర్లతో రేవంత్ వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎంను జానారెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి మధ్య దాదాపు గంట పాటు చర్చలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.
కొత్త ప్రభుత్వానికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారని జానారెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు, బాధలను తనకు తెలియజేయడం శుభపరిణామం అని చెప్పారు. ప్రజా అభిమానాన్ని చూరగొనేలా పని చేయాలని తాను చెప్పానని.. ప్రభుత్వంలో తన పాత్ర ఏమీ ఉండదని.. కానీ సలహాలు, సూచనలు కావాలంటే ఇస్తానని చెప్పానని వెల్లడించారు జానారెడ్డి. కానీ, మంత్రి పదవి ఇస్తున్నారనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.
ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయలేదు. ఆయన కుమారుడు జైవీర్ రెడ్డిని నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దింపి గెలిపించుకున్నారు. పార్టీలో సీనియర్ లీడర్ కావడంతో జానారెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నారనే వార్తలు వస్తున్నాయి. కీలక హోంశాఖ ఇంకా ఎవరికీ కేటాయించలేదు. సీఎం దగ్గరే ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు హోంశాఖను ఇస్తారా? రేవంత్ అందుకే కలిశారా? అని తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కింది.