– ఓఆర్ఆర్ టోల్ టెండర్ లెక్కలు తీస్తున్న రేవంత్ సర్కార్
– విచారణకు ఆదేశించిన సీఎం
– అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయం
– పూర్తి వివరాలు ఇవ్వాలని హెచ్ఎండీఏకు ఆదేశాలు
– సీబీఐతో కానీ.. మరో సంస్థకు విచారణ బాధ్యతలు
– హెచ్ఎండీఏ అధికారులతో రేవంత్ సమీక్ష
– హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్
– రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరణకు నిర్ణయం
– లే అవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు
రేవంత్ సర్కార్ ఏర్పడ్డాక.. గత ప్రభుత్వంలోని స్కాములు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే గొర్రెలు, ఆవులు, కాళేశ్వరం ఇలా ఏదో అంశంలో కేసీఆర్ బాగోతం బయటపడుతోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేటు నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది.. ఏయే సంస్థలున్నాయి.. బాధ్యులెవరు..? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు.
ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రాపాలీకి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినేట్లో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం చెప్పారు. ఇప్పటికే నీటిపారుదల, పశుసంవర్ధక శాఖలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… టోల్ టెండర్ అంశంపై దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ మహానగర మణిహారమైన ఓఆర్ఆర్ ను కేసీఆర్ ప్రభుత్వం దీర్ఘకాలిక లీజు కోసం అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో 30 ఏళ్లపాటు లీజుకు గాను తొలుత 4 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన తర్వాత ఎల్-1గా ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ నిలిచింది. మొత్తం రూ.7,380 కోట్లకు బిడ్ ఫైనల్ కాగా.. మేనేజ్మెంట్ నుంచి టోల్ వరకు మొత్తం కార్యకలాపాలు ప్రైవేట్ సంస్థ చూసుకుంటుంది. 158 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ ఉండగా, నిత్యం 1.30 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఔటర్ పై ఎక్కి, దిగడానికి 44 పాయింట్లతోపాటు 22 ఇంటర్ ఛేంజ్ జంక్షన్స్ ఉన్నాయి. టోల్ కలెక్షన్ల కింద ఓఆర్ఆర్ ద్వారా ఏటా రూ.500 కోట్ల దాకా రాబడి ఉండగా, ప్రతి సంవత్సరం 5 శాతం వరకు పెంచుకునే అవకాశముంది. అంతకుముందు ఓఆర్ఆర్ ను హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చూసేది. ఫండ్స్, మానవ వనరుల కొరత వల్ల నిర్వహణ భారంగా మారినందునే దీన్ని లీజుకు అప్పగిస్తున్నట్లు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం తెలిపింది. అయితే.. ఈ వ్యవహారంలో వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు విచారణకు నిర్ణయించారు. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో భయం మొదలైంది.
మరోవైపు, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ -2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాలను ఒకే యూనిట్‌గా అభివృద్ధి చేయాలన్నారు. ఓఆర్ఆర్ – ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలన్నారు.