తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో ఇవాళ(శుక్రవారం) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కులగణన తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి ఏకగ్రీవంగా అన్ని పార్టీల సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కులగణనపై సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కుల గణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపై సర్వే చేస్తామని తెలిపారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. దీనిని కూడా ప్రతిపక్షం చర్చను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకులకు అనుమానం ఉన్నా నిర్భయంగా ప్రస్తావించొచ్చని ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేయాలనుకున్నా చేయొచ్చని తెలిపారు. వెనుకబడిన వర్గాల సమాచారాన్ని సర్వే ద్వారా సేకరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే వివరాలను బహిర్గతం చేయలేదని వెల్లడించారు.
ఆ సమాచారాన్ని ఒక కుటుంబం తన దగ్గర దాచుకుందని ఆరోపించారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా తాము కులగణన తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రతిపక్షం ఇచ్చే సహేతుకమైన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు.